గ్రేటర్ లో వర్ష బీభత్సం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

గ్రేటర్ లో వర్ష బీభత్సం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌ సహా తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి వర్షం కురుస్తోంది. బలమైన ఈదురుగాలుతో వర్షం పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్ల చేరడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్ పొంగిపోర్లుతున్నాయి. నాలాల వెంబడి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 

ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులకు చెట్లు కూలిపోయాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

ఈ ప్రాంతాల్లో భారీ వర్షం

కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, బాచుపల్లి, నిజాంపేట, హైదర్‌నగర్‌, సుచిత్ర, సూరారంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం కారణంగా ఏమైనా ఇబ్బందులు వస్తే 040-21111111, 040- 29555500 కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి కోరారు. 

అప్రమత్తంగా ఉండాలె : జీహెచ్ఎంసీ మేయర్ 

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుండి జోనల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష ప్రభావం గల ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లపై నిలిచిన వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు.

పలుచోట్ల వర్షపాతం నమోదు

* శేరిలింగంపల్లిలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం
* షేక్ పేటట్ లో 5.2 సెంటీమీటర్లు
* జూబ్లీహిల్స్ లో 4.6 సెంటీమీటర్లు
* మాదాపూర్ లో 4.5 సెంటీమీటర్లు
* అమీర్ పేటలో 4 సెంటీమీటర్లు
* మూసాపేటలో 3.2 సెంటీమీటర్లు
* రామంతపూర్ లో 2.9 సెంటీమీటర్లు
* హయత్ నగర్ లో 2.8 సెంటీమీటర్లు
* చార్మినార్ లో 2.3 సెంటీమీటర్లు
* రాజేంద్రనగర్ లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు