అత్యాచార ఘటనపై సీఎం స్పందించకపోవడం బాధాకరం: రేవంత్

అత్యాచార ఘటనపై సీఎం స్పందించకపోవడం బాధాకరం: రేవంత్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్య, హత్య కేసుపై సీఎం కేసీఆర్ ఇంతవరకూ స్పందించకపోవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగికి అనుకోని ప్రమాదం జరిగితే రాష్ట్ర  ముఖ్యమంత్రి.. బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడంపై ఆయన మండిపడ్డారు.

వైద్యురాలి కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లిన రేవంత్ అనంతరం మీడియాతో మాట్లాడారు.  దేశమంతా బాధితురాలిపై జరిగిన దారుణాన్ని ఖండిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం విందులు చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు.  ప్రగతి భవన్ లో గొడ్డు మాంసం ,మేక మాంసం తినడం కాదు.. బాధితురాలికి జరిగిన అన్యాయంపై నోరు విప్పాలని ఆయన అన్నారు.

మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు కూడా ఈ దారుణంపై స్పందించకపోవడం, మాట్లాడకపోవడం విచారించాల్సిన విషయం అన్నారు రేవంత్. మహమూద్ అలీ, తలసాని లు ఈ ఘటనపై బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారని, వైద్యురాలికి జరిగిన సంఘటనే వారికి జరిగితే ఆ బాధేంటో తెలిసేదని అన్నారు. ఒక మనిషిలా మాట్లాడాలని తలసానికి సూచించారు.

పరామర్శించేందుకు వచ్చే వాళ్ళను కావాలనే అడ్డుకుంటూ..కాలనీ వాసులు అడ్డుకుంటున్నారని పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్  అన్నారు.  డీజీపీ మహేందర్ రెడ్డి ప్రియాంక రెడ్డి సంఘటనను నిర్లక్ష్యంగా చూస్తున్నారనీ, ఆయన్ను వెంటనే విధుల్లోంచి తొలగించాలన్నారు. నేరస్తులపై నిఘా పెట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. విధులకు కాకుండా పోలీసులను ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారన్నారు.

వైద్యురాలిపై జరిగిన ఈ దారుణాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని అన్నారు రేవంత్. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని, నిందితులకి కఠిన శిక్ష పడేలా కోరుతానని అన్నారు.

డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ప్రజలు, మహిళలు ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితులను నడిరోడ్డుపై ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.