ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే! గత సర్కారు పెద్దలు, సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు

ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే! గత సర్కారు పెద్దలు, సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు
  • ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చిచెప్పిన టెర్రాసిస్​
  • బీఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ 
  • మార్చిన భూముల వివరాలు సర్కారుకు అందజేత
  • ధరణికి ముందు పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాలు
  • ధరణి వచ్చాక 1.55 కోట్ల ఎకరాలకు పెరుగుదల
  • కొత్తగా 25 లక్షల ఎకరాలకు పట్టాలు.. ఆ మేరకు తగ్గిన 
  • ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, వక్ఫ్, వివాదాస్పద భూములు

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​లో భూముల వివరాలను మార్చినట్లు గతంలో ఆ పోర్టల్​ను నిర్వహించిన టెర్రాసిస్ కంపెనీ అంగీకరించింది. అధికారుల ప్రమేయం లేకుండా, వారి వేలి ముద్రలు, క్షేత్రస్థాయి రిపోర్టులతో సంబంధం లేకుండా బ్యాక్ ఎండ్​లో ఈ వ్యవహారం నడిపినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించింది. గత ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలతో పాటు అప్పటి సీఎస్ నుంచి కొన్ని మెయిల్స్ వచ్చాయని.. దాంతో ఆ భూముల వివరాలను ఎలా మార్చాలని చెబితే ఆ రకంగానే మార్చామని ఒప్పుకుంది. 

ఆ డేటా వివరాలను ప్రస్తుత ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పోర్టల్ తెచ్చిన తర్వాత.. ధరణి పోర్టల్​ను పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. కేరళకు చెందిన ‘కేరళ సెక్యూరిటీ ఆడిట్​అస్యూరెన్స్ సెంటర్’ అనే ప్రభుత్వ రంగ సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ వ్యవహారాలు చూసిన టెర్రాసిస్ కంపెనీ బ్యాక్ ఎండ్​లో భూముల వివరాల్లో మార్పులు చేశామని ఒప్పుకున్నట్లు తెలిసింది. 

కొన్నిసార్లు ఐటీ డిపార్ట్​మెంట్ పరిధిలోని ఈ– గవర్నెన్స్, తెలంగాణ స్టేట్ టెక్నాలాజికల్ సర్వీసె స్​(టీజీటీఎస్) నుంచి కూడా పలు భూముల్లో మార్పు లు జరిగాయని ప్రభుత్వానికి నివేదించింది. ఏయే భూముల వివరాలు మారాయనే దానిపై రెవెన్యూ శాఖ లోతుగా స్టడీ చేస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ మొదలుపెడితే మరిన్ని అవకతవకలు ఆధారాలతో సహా బయటపడతాయని అధికార వర్గాలు
 పేర్కొంటున్నాయి.  

ఇష్టమొచ్చినట్టుగా మార్పులు.. 

ఒక్క క్లిక్​తో వందలు, వేల కోట్ల విలువైన భూములు సొంతమయ్యే అవకాశం ఉండడంతో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు ధరణిలోని భూముల వివరాలను ఇష్టారీతిన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిషేధిత జాబితాలోని భూ ములను పట్టాభూములుగా మార్చుకున్నారనే ఆరోపణ లున్నాయి. ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి 2017లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య భూ రికార్డుల ప్రక్షాళ న జరిగింది. 

దానికి ముందు రాష్ట్రంలో పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాలు ఉండగా, ధరణి పోర్టల్ వచ్చిన తరువాత 2020 అక్టోబర్​ నాటికి 1.55 కోట్ల ఎకరాల కు పట్టా భూములు పెరిగాయి. ఏకంగా 25 లక్షల ఎకరాలకు కొత్తగా పట్టాలు పుట్టుకొచ్చాయి. ఆ మేరకు అటవీ, దేవాదాయ, వక్ఫ్, తదితర భూముల విస్తీర్ణం తగ్గిపోయింది. ఫారెస్ట్ యాక్ట్​లో సెక్షన్ 15 ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు 53 లక్షల ఎకరాలుగా ఉంది. కానీ ధరణి పోర్టల్​లో అటవీ భూముల లెక్క 47 లక్షల ఎకరాలు మాత్రమే చూపిస్తోంది. 

అంటే 6 లక్షల ఎకరాలపై గందరగోళం నెలకొంది. ఇందులో కొన్ని భూములు అసైన్డ్ లిస్ట్​లో చూపిస్తుండగా, మరికొన్నింటికి లెక్కాపత్రం లేకుండా పోయింది. వక్ఫ్​తో పాటు దేవాదాయశాఖకు చెందిన దాదాపు 40 శాతం భూముల లెక్కలు కూడా ధరణిలోకి ఎక్కలేదు. రాష్ట్రంలో 90 వేల ఎకరాల ఎండోమెంట్ భూములకుగాను కేవలం 50 వేల ఎకరాలు మాత్రమే ధరణిలో ఎంట్రీ అయింది. ఇలా ప్రభుత్వ, అసైన్డ్, ఎండోమెంట్, ఫారెస్ట్ భూములను పట్టా భూములుగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

జీవో బయటకు రాకుండా టీజీటీఎస్​కు బాధ్యతలు

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు బాధ్యతలన్నింటినీ ఐటీ డిపార్ట్​మెంట్ పరిధిలోని ఈ– గవర్నెన్స్, టీజీటీఎస్ స్పెషల్ కమిషనర్ జీటీ  వెంకటేశ్వర్ ​రావుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ఎలాంటి సంబంధం లేకపోయినా ధరణి ప్రాజెక్టు డైరెక్టర్​గా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. ఈ మేరకు 2020 సెప్టెంబర్ 18న అప్పటి సీఎస్, సీసీఎల్ఏ జీవో ఇచ్చారు. కానీ ఈ జీవో విషయం అప్పట్లో బయటకు రానివ్వలేదు. సాధారణంగా ఏదైనా డిపార్ట్​మెంట్​లో కొత్త సాఫ్ట్​వేర్, యాప్​ను అందుబాటులోకి తెస్తే.. అందులో టెక్నికల్ వ్యవహారాలు, సైట్ ప్రాబ్లమ్స్, కొత్త అప్​డేట్స్​వంటి సమయాల్లో మాత్రమే ఐటీ డిపార్ట్​మెంట్ సహకారం తీసుకుంటారు. కానీ, ధరణి పోర్టల్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. 

అంతకుముందున్న ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్​మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్)కు సంబంధించి ఐటీ శాఖ పరిధిలోని టీజీ టీఎస్​ కేవలం వెండర్ పేమెంట్, కాంట్రాక్ట్ మేనేజ్​మెంట్, నెట్​వర్కింగ్, బ్యాండ్​విడ్త్, ఎక్స్​టర్నల్ అప్లికేషన్ ఇంటర్​ఫేజ్ వంటి టెక్నికల్ అంశాలు చూసింది. వీటికి సంబంధించి కూడా రోజు వారీగా సీఎమ్మార్వోతో సంప్రదించి సీసీఎల్ఏలో రిపో ర్ట్​ చేసేవారు. కానీ, ఐఎల్ఆర్ఎంస్ సైట్ ఎప్పుడైతే ధరణిగా మారిందో అప్పటి నుంచే దాన్ని పూర్తిగా ఐటీ డిపార్ట్​మెంట్ పరిధిలోని టీజీటీఎస్​కు అప్పగించేశారు. రికార్డులు మొదలు ధరణిలో మార్పులు, చేర్పులు అన్నీ టీజీటీఎస్ ఆధ్వర్యంలోనే సాగేవి. ఇలా టీజీటీఎస్ దగ్గర ఉన్న లాగిన్​లోనూ భూముల్లో అనేక మార్పులు జరిగినట్లు కాంగ్రెస్ సర్కారు గుర్తించింది.

ఆ 7 జిల్లాల్లోనే ఎక్కువ !

ధరణి పోర్టల్​లో బ్యాక్ ఎండ్​లో మారిన భూముల్లో ఎక్కువ శాతం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయా జిల్లాల్లో భూముల రేట్లు కోట్లలో ఉండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అత్యంత విలువైన వందల ఎకరాల వివాదాస్పద భూములు, అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ స్థలాలు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఎనిమీస్​ ల్యాండ్స్​ను పట్టా భూములుగా మార్చినట్లు చెప్తున్నారు. ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్లలోని భూములను కూడా టీజీటీఎస్ ద్వారా కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. 

ఇవేవీ అధికారికంగా రికార్డు కాలేదు. అప్పటికే వీఆర్వోలను తొలగించడంతోపాటు తహసీల్దార్లు, ఆర్డీవోలకు ధరణిలో యాక్సెస్ ఇవ్వకపోవడంతో అక్రమాలు బయటకురాలేదు. ధరణి వ్యవస్థ పూర్తిగా టెర్రాసిస్ కంపెనీ, తెలంగాణ స్టేట్ టెక్నాలాజికల్ సర్వీసెస్ (టీజీటీఎస్) కనుసన్నల్లోకి వెళ్లిన టైంలో మార్పులన్నీ గుట్టుగా జరిగిపోయాయి. 

కాగా, ధరణిలో ప్రభుత్వ, దేవాదాయ, అటవీ, వక్ఫ్, వివాదాస్పద భూముల వివరాలు మారిపోతుండడంతో అసలు ఏం జరుగుతోందో తెలియక అప్పటి కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో భూముల అమ్మకాలు, కొనుగోళ్ల బాధ్యతలు చూసే తహసీల్దార్లు తలలు పట్టుకున్న సందర్భాలున్నాయి.