
- పుప్పాలగూడ శివారులో మొదటి దశ ఏర్పాటు
- ఐదు లక్షల మంది యువతకు ఉపాధి
- మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియెట్‌లో సీఎస్ శాంతి కుమారి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖ అధికారులతో గురువారం సమావేశం అయ్యారు.
పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారుల కోసం ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించింది. వీరితో పాటు రెవెన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితర సంఘాలకు సుమారు 200 ఎకరాల పైచిలుకు ల్యాండ్‌ను ప్రభుత్వం కేటాయించింది. పుప్పాలగూడ పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ భూమికి పక్కనే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కు సంబంధించిన సుమారు 250 ఎకరాలు ఉన్నట్లు అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. మొత్తంగా మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ అభివృద్ధికి సుమారు 450 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రుల బృందానికి అధికారులు వివరించారు.
‘‘దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత నాలెడ్జ్ హబ్ ఏర్పాటైంది. అనంతరం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపుదిద్దుకున్నది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులో హైదరాబాద్ భాగస్వామి అయింది. ఇప్పుడు కూడా ఐటీ రంగంలో ఏఐ టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పును హైదరాబాద్ అందిపుచ్చుకోవాలి’’అని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. ఆర్థిక అభివృద్ధిలో హైదరాబాద్ సుస్థిర స్థానాన్ని ఇప్పటికే సాధించిందని ఆర్థికవేత్తలు స్పష్టం చేసిన విషయాన్ని మంత్రులు చర్చించారు.