
- పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నం: మంత్రి శ్రీధర్ బాబు
- హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన జాగర్ జీసీసీ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ప్రపంచ ఏఐ రాజధానిగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకోసం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్ప్రైజ్ప్రొక్యూర్మెంట్, సప్లయర్ కొలాబరేషన్సంస్థ జాగర్.. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘ఒక్క టెక్నాలజీకే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. ఈ జాబితాలో జాగర్ కూడా చేరడంతో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది. కొత్తగా ప్రారంభమైన ఈ జీసీసీ ద్వారా కొత్తగా 180 మందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 500కు చేరుతుంది’’ అని ఆయన తెలిపారు.
‘‘జాగర్ ఏఐ ప్లాట్ ఫాం, ఏఐ ఆధారిత ప్రొక్యూర్‌మెంట్ పరిష్కారాల అభివృద్ధికి ఈ జీసీసీ ఒక వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తయారీ, విద్య, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్ తదితర రంగాలకు సాఫ్ట్‌వేర్, క్లౌడ్ ఆపరేషన్ సేవలను అందిస్తుంది. జీసీసీల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గతేడాదిలో 70 జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 100 జీసీసీలను కొత్తగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఏఐ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేకంగా ఏఐ సిటీని అభివృద్ధి చేయనున్నాం. ప్రపంచానికి ఏఐ నిపుణులను అందించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాగర్ సీఈవో ఆండ్రూ రోస్కో, చీఫ్ డిజిటల్ , ఏఐ ఆఫీసర్ – డెవలెప్ మెంట్ గోపీనాథ్ పోలవరపు, చీఫ్ కస్టమర్ ఆఫీసర్ ట్రాయ్ మేయర్ తదితరులు పాల్గొన్నారు.