
- కాంగ్రెస్ లీడర్లే టార్గెట్ గా ఐటీ రెయిడ్స్
- మహేశ్వరం క్యాండిడేట్ కేఎల్ఆర్ ఇంటిపై దాడి
- బడంగ్ పేట మేయర్ పారిజాత ఇంట్లోనూ సోదాలు
- వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ అధికారుల తనిఖీలు
- కోమటిరెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంట్లో కూడా..
- బంధువులు, అనుచరుల ఇండ్లలోనూ రెయిడ్స్
- 14 ప్రాంతాల్లో 32 మంది అధికారుల తనిఖీలు
- పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలు
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఇండ్లు, వ్యాపార సంస్థలపై ఆదాయపన్ను అధికారులు దాడులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి అనుచరుల లావాదేవీలపై నిఘా పెట్టిన ఐటీ అధికారులు ఇవాళ ఉదయం దాడులు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నివాసంపై ఇవాళ ఉదయం అధికారులు మెరుపుదాడులకు దిగారు. బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంటిపైనా దాడులు కొనసాగుతున్నాయి. వీళ్ల అనుచరులు బంధువుల ఇండ్లపైనా ఐటీ శాఖ దాడులు చేసింది.
గతంలో బాలాపూర్ గణేశ్ లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి నివాసంపైనా ఐటీ అధికారులు దాడులకు దిగారు. దాదాపు 32 మంది ఐటీ అధికారులు 14 ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఉదయం 5.30 గంటలకే సోదాలు ప్రారంభించారు. శంషాబాద్ బహదూర్ గూడలోని కేఎల్ఆర్ ఫామ్ హౌస్ తో పాటు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివాసం, సికింద్రాబాద్ లోని కేఎల్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కార్పొరేట్ ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కుటుంబ సభ్యులు, సిబ్బంది వద్ద మొబైల్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు జరుగుతున్న ప్రాంతాల్లో కి ఇతరులను ఎవ్వరినీ అనుమతించలేదు. మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కేఎల్ఆర్ కు టికెట్ దక్కిన రోజుల వ్యవధిలోనే ఐటీ సోదాలు జరగడం పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కొందరు బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
సబితతో విభేదించి కాంగ్రెస్ లో చేరి..
బాలాపూర్ కు చెందిన చిగురింత పారిజాత బడంగ్ పేట్ మేయర్ గా ఉన్నారు.ఆమె భర్త నర్సింహారెడ్డి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అత్యంత సమీపనేతగా పనిచేశాడు. బాలాపూర్ సహా పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్,పెద్ద సంఖ్యలో వైన్స్ నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా సబితా ఇంద్రారెడ్డి,పారిజాత నర్సింహారెడ్డిల మధ్య విబేధాలు తలెత్తాయి.దీంతో నర్సింహారెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తరువాత సబితాపై పోటీగా మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ధిగా టికెట్ తెచ్చుకునేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ నడిపారు.
కానీ వివిధ సమీకరణాల మధ్య టికెట్ కేఎల్ఆర్ కు దక్కింది. సోదాల సమయంలో మేయర్ చిగురింత పారిజాత ఆమె భర్త నర్సింహా రెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కూతురు ఇంట్లో ఉండడంతో ఆమె వద్ద మొబైల్ తీసుకున్నారు. పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం అందించారు. బ్యాంక్ పాస్ బుక్స్, ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
కేఎల్ఆర్ ఫాం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేఎల్అర్ ను బయటికి పంపించాలని డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి,కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
కోమటిరెడ్డి తోడల్లుడి ఇంటిపై..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి నివాసంపైనా ఐటీ అధికారులు రెయిడ్ చేశారు. కోకాపేట- హిడెన్ గార్డెన్ లోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు తనిఖీలు చేపట్టారు. గిరిధర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ నుంచి కాంగ్రెస్ అబ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ దాడుల వెనుక రాజకీయ కారణం ఉన్నట్టు తెలుస్తోంది.
ALSO READ : తెలంగాణకు మోదీ.. మూడు రోజుల గ్యాప్లో రెండు సార్లు