మిర్యాలగూడలోని రైస్ మిల్లర్ల ఇండ్లలో .. ఐటీ అధికారుల సోదాలు

మిర్యాలగూడలోని రైస్ మిల్లర్ల ఇండ్లలో .. ఐటీ అధికారుల సోదాలు

మిర్యాలగూడలోని రైస్ మిల్లర్ల ఇండ్లలో .. ఐటీ అధికారుల సోదాలు
రైస్ మిల్లుల్లో కూడా తనిఖీలు
హార్డ్ డిస్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
వ్యాపారులు పన్నులు ఎగ్గొట్టారని ఆరోపణలు
ఎన్నికల వేళ తనిఖీలపై సర్వత్రా చర్చ

మిర్యాలగూడ/నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైదేహి టౌన్ షిప్ లో ప్రముఖ కాంట్రాక్టర్, బిల్డర్ వింజం శ్రీధర్  నివాసంలో ఇన్ కం ట్యాక్స్ (ఐటీ) అధికారులు గురువారం సోదాలు చేశారు. అలాగే వ్యాపారులు బండారు కుశలయ్య, రంగా శ్రీధర్, రంజిత్, రేపాల అంతయ్యకు చెందిన  రైస్ మిల్లులు, వారి ఇండ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు. సుమారు 40 మంది ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. వ్యాపారవేత్తలు, వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను పరిశీలించి లాకర్లను తెరిపించి అందులో దాచిన సొమ్మును లెక్కించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా హార్డ్ డిస్కులు, కీలక డాక్యుమెంట్లు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 మిర్యాలగూడలో అధునాతన రైస్ మిల్లులను ఏర్పాటుచేసిన బడా రైస్ మిల్లర్లు.. ప్రతి వ్యవసాయ సీజన్ లో లోకల్  రైతులు సహా కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర,  తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో సన్న, ఇతర వడ్లను తక్కువ రేట్లకు కొని ఆ వడ్లను బియ్యంగా మారుస్తున్నారు. వాటిని హైదరాబాద్, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయల లాభం పొందుతున్నారని, ఐటీ రిటర్న్స్ లో నామమాత్రపు లాభాలు చూపుతూ పన్నులు ఎగ్గొడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు అనుమానించి సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం వరకు తనిఖీలు జరిపే అవకాశం ఉంది. కాగా, గడిచిన రెండేళ్లుగా ఇక్కడి రైస్ మిల్లర్లు తక్కువ లాభాలు చూపడంతోనే సోదాలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ బడా రైస్ మిల్లర్ల నివాసాలు, రైస్ మిల్లుల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

నల్గొండలోనూ ప్రముఖ వ్యాపారి ఇంట్లో సోదాలు

నల్గొండలోని ప్రముఖ వ్యాపారి మహేందర్​ ఇంటితో పాటు ఆయన రైస్ మిల్లులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారుల బృందం సోదాలు చేసింది. మహేందర్​ నివాసంతో పాటు ఆయన సన్నిహితుల ఇండ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో 40 మంది అధికారులు టీములుగా ఏర్పడి తనిఖీలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పేరున్న మహీంద్రా మిల్లు, సుమాంజలి పార్​బాయిల్డ్​ రైస్​మిల్లుతో పాటు పలు ప్రాంతాలలో కూడా సోదాలు చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు తనిఖీలు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు సోదాలు నిర్వహించనున్నారని తెలిసింది.

ALSO READ: 40 వేల జాబ్స్ ఇప్పిస్త .. చెన్నూరు యువతకు వివేక్ వెంకటస్వామి హామీ

ఐటీ అధికారుల సోదాలతో నాకు సంబంధం లేదు 

నల్గొండలో ఐటీ అధికారులు చేసిన సోదాలపై బీఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు స్పందించారు. తమపై, తమ కుటుంబ సభ్యులకు చెందిన ఆఫీసుల్లో నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని, ఈ ఐటీ సోదాలతో తమకేమీ సంబంధం లేదని ఆయన చెప్పారు.