40 వేల జాబ్స్ ఇప్పిస్త .. చెన్నూరు యువతకు వివేక్ వెంకటస్వామి హామీ

40 వేల జాబ్స్ ఇప్పిస్త .. చెన్నూరు యువతకు వివేక్ వెంకటస్వామి హామీ
  • ఏడాదిలోగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
  • నేను ప్రభుత్వానికి పన్ను కట్టి వ్యాపారం చేస్కుంటున్న 
  • బాల్క సుమన్ లాగా ఇసుక పన్ను ఎగ్గొట్టి సొమ్ము చేస్కోలేదని కామెంట్​

  చెన్నూర్​లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని.. తనను గెలిపిస్తే వాటిని సద్వినియోగం చేసుకుని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి చెప్పారు. సింగరేణి అనుబంధ సంస్థలను ప్రోత్సహిస్తానని తెలిపారు. తాను గెలిచినంక చెన్నూర్ యువతకు ఐదేండ్లలో దాదాపు 40 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్లాన్ రెడీ చేశానని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్లు, మైనింగ్ ఇన్‌స్టిట్యూట్, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, అగ్రి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో పాటు సిరామిక్ టైల్స్ ఇండస్ట్రీ అభివృద్ధి ద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. చెన్నూర్​లో ఉన్న వనరులను వాడుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించవచ్చన్నారు. గురువారం మంచిర్యాలలోని తన ఇంట్లో వివేక్ మీడియాతో మాట్లాడారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తమ కుటుంబం ఏండ్లుగా ప్రజలతోనే మమేకమవుతోందని, తనను గెలిపిస్తే ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని, ఎమ్మెల్యేగా గెలిచినంక ఏడాదిలోపు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 

సింగరేణిని కాపాడింది కాకానే.. 

తన తండ్రి కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల లోన్ ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడారని వివేక్ గుర్తుచేశారు. కాకా కృషితోనే లక్ష మంది కార్మికులకు ఉద్యోగ భద్రత దక్కిందని చెప్పారు. ‘‘కాకానే మందమర్రిలో లెదర్ పార్క్ కోసం 25 ఎకరాలు ఇప్పించారు. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జైపూర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఘనత కాకాకే దక్కుతుంది. దేశవ్యాప్తంగా కార్మికులకు పెన్షన్ స్కీమ్ తెచ్చింది కాకానే. ప్రజలకు రేషన్ ఏర్పాటు చేసి, ఆహార కొరత తీర్చింది ఆయనే. మంచిర్యాల నుంచి మందమర్రి, బెల్లంపల్లి వరకు గోదావరి మంచినీటి పైప్ లైన్​ను కాకా హయాంలోనే ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని నేను రీఓపెన్ చేయించాను. కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు ఇప్పించాను” అని తెలిపారు. తమ కంపెనీల్లో 55 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ విద్యాసంస్థల్లో చదువుకుని లక్ష మందికి పైగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారని చెప్పారు. తమ విద్యాసంస్థలతో ఏటా 5 వేల మందికి ఉచిత విద్యనందిస్తున్నామని తెలిపారు. 

కేసీఆర్ కోట్లు కొల్లగొట్టిండు.. 

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో 20 వేలకు పైగా ఉద్యోగాలు తగ్గిపోయాయని వివేక్ చెప్పారు. ‘‘తెలంగాణ రాకముందు సింగరేణిలో 60 వేల మందికి పైగా కార్మికులు పని చేశారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత కార్మికుల సంఖ్య 40 వేలకు తగ్గింది. కొత్త బొగ్గు గనులు తీసుకురాకపోవడం, కేసీఆర్ సర్కార్ విధానాల వల్లనే 20 వేల ఉద్యోగాలు తగ్గాయి” అని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ భగీరథతో కేసీఆర్ రూ.కోట్లల్లో ప్రజాధనం కొల్లగొట్టారని, గ్రావిటీని పరిగణనలోకి తీసుకోకుండా కాళేశ్వరం కట్టిన తుగ్లక్ సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. 

సుమన్ చేసిన అభివృద్ధేం లేదు.. 

తాను లీగల్​గా సంపాదించానని, బాల్క సుమన్ లాగా దోచుకోలేదని వివేక్ అన్నారు. ‘‘నేను ప్రభుత్వానికి పన్ను కట్టి వ్యాపారం చేసే వ్యక్తిని. బాల్క సుమన్ లాగా ఇసుక పన్ను ఎగ్గొట్టి సొమ్ము చేస్కోలేదు. నా లావాదేవీలన్నీ లీగల్. ఏ ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు. నా సంస్థలన్నీ ప్రైవేట్​వే” అని చెప్పారు. 50 బెడ్ల ఆస్పత్రి , చెన్నూరు టౌన్ రోడ్లలో సెంట్రల్ లైటింగ్ చూపెట్టి.. ఇదే అభివృద్ది అంటూ ప్రజలను బాల్క సుమన్ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ‘‘నేను ఎంపీగా ఉన్నప్పుడు క్యాతనల్లి రైల్వే గేట్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి  రూ .32 కోట్లు మంజూరు చేయించాను. ఎంపీగా, ఎమ్మెల్యేగా పదేండ్లు కొనసాగిన బాల్క సుమన్.. ఆర్వోబీ అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించడంలో ఫెయిలయ్యారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి” అని అన్నారు. 

దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమేస్తరు.. 

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, ఆ గాలికి బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని వివేక్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడం తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ‘‘కాళేశ్వరం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ ఒక్క ఎకరానికి కూడా ఇవ్వలేదు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని తరిమివేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్​ను గెలిపించాలని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యను చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎత్తుగడలను చిత్తు చేయాలని కాంగ్రెస్ క్యాడర్​కు సూచించారు. ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు.మీడియా సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ, పీసీసీ జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్, మందమర్రి ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. 

also read: తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సర్కార్

వివేక్ గెలిస్తేనే అభివృద్ధి: జనక్ ప్రసాద్  


వివేక్ వెంకటస్వామిని గెలిపిస్తే చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త భూగర్భ గనులు, కొత్త ఉద్యోగాల కల్పనకు వివేక్ కట్టుబడి ఉంటారని జనక్ ప్రసాద్ చెప్పారు.