ప్రైమరీ ఎడ్యుకేషన్ లో దేశంలోనే కింది నుంచి మూడో స్థానం

ప్రైమరీ ఎడ్యుకేషన్ లో దేశంలోనే కింది నుంచి మూడో స్థానం
  • దేశంలోనే కింది నుంచి మూడో స్థానంలో రాష్ట్రం

హైదరాబాద్,వెలుగు: ‘‘జాతీయసర్వే ప్రకారం ప్రైమరీ ఎడ్యుకేషన్ లో దేశంలోనే కింది నుంచి మూడో స్థానంలో ఉన్నాం. రాష్ట్రంలో దాదాపు75% మంది ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకు పూర్తిస్థాయి లర్నింగ్ స్టాండర్డ్స్ ఉండటం లేదు. అందుకే స్టూడెంట్లలో స్టాండర్డ్స్ పెంచేందుకు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి’’ అని డీఈఓలను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దీన్ని పర్యవేక్షించాలని సూచించారు. తొలిమెట్టు కార్యక్రమంపై గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనతో కలిసి జిల్లా కలెక్టర్లు, డీఈఓలతో వాకాటి కరుణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పిల్లలను భాగస్వామ్యం చేస్తూ విద్యాబోధన జరగాలని, 2023 మార్చి నాటికి పిల్లల సామర్థ్యం పెంచేలా ప్లాన్ రెడీ చేస్కోవాలన్నారు.   

పిల్లల ‘కెపాసిటీ’ యాప్ లో నమోదు 

రాష్ట్రవ్యాప్తంగా 5 వేల సర్కారు బడుల్లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లా నుంచి 150 స్కూళ్లను గుర్తించాలని కలెక్టర్లను వాకాటి కరుణ ఆదేశించారు. నవంబర్ నాటికి లైబ్రరీలను సిద్ధం చేయాలన్నారు. తొలిమెట్టు అమలు కోసం 223 మంది జిల్లా రిసోర్స్ పర్సన్లు, 2,818 మంది మండల రీసోర్స్ పర్సన్లతో పాటు 48 వేల మంది ప్రైమరీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. 600 మంది సీనియర్ హెడ్మాస్టర్లకు తొలిమెట్టు మండల నోడల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఈ నెల15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైమరీ స్టూడెంట్లను పరీక్షించి, వారి కెపాసిటీని యాప్​లో పిల్లల ఆధార్ నెంబర్ల వారీగా నమోదు చేయాలని సూచించారు. ప్రతిరోజూ స్టూడెంట్లు చదివేలా రీడింగ్ పీరియడ్ పెట్టాలన్నారు. పేరెంట్స్, ఆఫీసర్ల సమన్వయంతో మార్చి 2023 నాటికి ప్రైమరీ ఎడ్యుకేషన్​లో మార్పులు తీసుకురావాలని కోరారు. అనంతరం రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అమలు చేసి మంచి ఫలితాలు సాధించిన మోడల్​లను ఆమె వివరించారు.