సిట్ విచారణకు దూరంగా బండి సంజయ్..

సిట్ విచారణకు దూరంగా బండి సంజయ్..

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సిట్‌ విచారణకు మార్చి 26వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరుకారని తెలుస్తోంది. ఆదివారం జరిపే సిట్ విచారణకు వెళ్లకూడదని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్ తరుఫున బీజేపీ లీగల్ టీం సిట్ ముందుకు హాజరవుతుందని చెబుతున్నారు. 

మార్చి 26న బండి సంజయ్ కర్ణాటకకు వెళ్తున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ప్రోగ్రాంలో బండి సంజయ్ పాల్గొననున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే పేపర్ లీకేజీపై తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తానని బండి సంజయ్ చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ ప్రజాక్షేత్రంలో  పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రానున్న నెల రోజులకు కార్యాచరణ ప్రకటించింది బీజేపీ. 

మరోవైపు.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఏ1 నిందితుడు ప్రవీణ్‌తోపాటు ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా నాయక్‌, ఏ5 కేతావత్‌ రాజేశ్వర్‌లను కస్టడీకి అప్పగించింది. ఈ నలుగురు నిందితులను మార్చి 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సిట్‌ అధికారులు విచారించనున్నారు. మిగతా ముగ్గురు నిందితులు ఏ-10, ఏ-11, ఏ-12ల కస్టడీ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.