మెదక్ పార్లమెంటు బరిలో ప్రియాంక.. టీ కాంగ్రెస్ కొత్త ప్లాన్!

మెదక్ పార్లమెంటు బరిలో ప్రియాంక..  టీ కాంగ్రెస్ కొత్త ప్లాన్!
  • మెదక్ పార్లమెంటు బరిలో ప్రియాంక
  • టీ కాంగ్రెస్ కొత్త ప్లాన్!
  • నాయినమ్మ ఇందిర సెగ్మెంట్ నుంచే పోటీకి ఏర్పాట్లు
  • దక్షిణాదిలో మరింత స్ట్రాంగ్ అయ్యేలా ప్లాన్
  • రాష్ట్రంలో విస్తృతంగా ప్రియాంక పర్యటనలు
  • గ్రామీణ ప్రజలతో మమేకమవుతూ ప్రచారం
  • గిరిజనులతో నృత్యాలు.. చిన్నారులతో మాటా మంతి

హైదరాబాద్ : మెదక్ పార్లమెంటు స్థానం నుంచి  ప్రియాంకగాంధీ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వస్తున్న స్పందన ఆమెను అబ్బురపరుస్తోంది. మెదక్ నుంచి ఒకప్పుడు ప్రియాంక నాయినమ్మ ఇందిరాగాంధీ  ప్రాతినిధ్యం వహించారు. అదే సెగ్మెంట్ నుంచి ప్రియాంకను పోటీ చేయించడం ద్వారా  దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలుంటాయని టీపీసీసీ భావిస్తోంది. ఈ విషయంలో ఇదివరకే ఏఐసీసీ లోనూ చర్చ జరిగిందని స్వయంగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి తారీఖ్ అన్వర్ వెల్లడించారు.  

1980లో ఎంపీగా 

1980లో మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరా గాంధీ రెండు లక్షల మెజార్టీతో విజయం సాధించారు. 1984 అక్టోబరు 31న హత్యకు గురయ్యే వరకు ఆమె మెదక్‌ ఎంపీగానే ఉన్నారు. ఆ రోజుల్లో ఉత్తరాదిన జనతా పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండడంతో, ఆంధ్రప్రదేశ్ లో ఇందిరతో పోటీ చేయించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. మెదక్ నుంచి పోటీ చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతల అభ్యర్థనకు ఆమె అంగీకరించారు. ఇప్పుడు కూడా ఉత్తరాదిలో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం, తెలంగాణలోనూ పార్టీకి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇందిరా గాంధీ లాంటి రూపం, చిరునవ్వు, ఆమెలా సాహసోపేత నిర్ణయాలు తీసుకునే సత్తా ఆమెను విజయతీరాలకు నడిపించడంతోపాటు పార్టీకి కొత్త ఊపును తీసుకొస్తుందని స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 

మెదక్ మదిలో ఇందిర

మెదక్ నుంచి గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 1984 జులై 19న మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సర్పంచుల సదస్సుకు హాజరై అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించారు. మెదక్‌లో మున్సిపల్‌ షాపింగ్‌‌ కాంప్లెక్స్‌‌ స్థానిక ఎంపీ హోదాలోనే శంకుస్థాపన చేశారు.  సంగారెడ్డిలో జరిగిన జెడ్పీ మీటింగ్ కు హాజరయ్యారు. ఇందిర చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ మెదక్ ప్రజల మదిలో మెలుగుతున్నాయని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ నుంచి ప్రియాంక ను పోటీ చేయిస్తే గెలుపొందడం సులభమనే చర్చ మొదలైంది. ఈ విషయం ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

జనంతో ప్రియాంక మమేకం

అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీ స్థానికులతో మమేకమవుతున్నారు. బతుకమ్మను, బోనాల పండుగను ప్రస్తావిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మకు జేజేలు పలుకుతున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇస్తున్నారు.  ప్రతి మీటింగ్ లో జై తెలంగాణ అనే నినాదంతోనే ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. కూలీలతో ముచ్చటిస్తున్నారు. చంటి బిడ్డలను లాలిస్తున్నారు. గ్రామీణులతో సెల్ఫీలు దిగుతున్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చిరునవ్వులు చిందిస్తూ మమేకమవుతున్న తీరుకు జనం ఫిదా అవుతున్నారు.