బీఆర్ఎస్లోకి కాసాని?

బీఆర్ఎస్లోకి కాసాని?
  • బీఆర్ఎస్లోకి కాసాని?
  • టీటీడీపీ అధ్యక్షుడికి గులాబీ పార్టీ గాలం
  • తెలంగాణలో పోటీకి చంద్రబాబు నో
  • అధినేత నిర్ణయంతో నొచ్చుకున్న జ్ఞానేశ్వర్ ముదిరాజ్
  • కండువా కప్పేందుకు సిద్ధమైన అధికార పార్టీ
  • టీడీపీ పోటీ చేయకపోవడం కాంగ్రెస్ కు కలిసొస్తుందని టాక్ 

హైదరాబాద్ : టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కారెక్కనున్నారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో ఆయన నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కాసాని జ్ఞానేశ్వర్ కు కండువా కప్పేందుకు గులాబీ పార్టీ రెడీ అయ్యిందని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఆయన బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. 

తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని  ప్రకటించిన కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేశారు. నిన్న ఉదయం తెలంగాణ లో తాము పోటీ చేయడం లేదంటూ టీడీపీ యువనేత లోకేశ్​ పేరుతో ప్రకటన వెలువడింది. దీనిపై స్పందించిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అది కరెక్ట్ కాదని, తాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతానని ప్రకటించారు. తర్వాత 89 సెగ్మెంట్లలో పోటీ చేస్తామని తెలిపారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో తెలగుదేశం పార్టీ నిర్ణయం మారిపోయింది. 

తమ పార్టీ చేయడం వల్ల సీట్లు గెలవకపోగా..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీఆర్ఎస్ కు ప్రయోజనం కలుగుతుందని, ముఖ్యంగా సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని టీడీపీ భావిస్తున్నది. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీ విజయానికి గండి పడుతుందనే విశ్లేషణలు కూడా వచ్చాయి. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న  టీడీపీ అధినాయకత్వం..  తెలంగాణలో పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ విజయవకాశాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే తప్పుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. 

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కీలక నేతల్లో చాలా మంది గతంలో టీడీపీలో పనిచేసిన వారే.  సాక్షాత్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే ఆ పార్టీ  నుంచి వచ్చిన వారే కావడంతో కాంగ్రెస్ విజయానికి గండి పడకుండా ఉండే చర్యల్లో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ నడుస్తోంది.

కండువా కప్పనున్న బీఆర్ఎస్ !

ముదిరాజ్ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టికెట్ కేటాయించలేదు. యాభై లక్షల ఓట్లున్న తమను అధికార పార్టీ లెక్క చేయడం లేదని ముదిరాజ్ సామాజికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తోంది. పటాన్ చెరు టికెట్ ఆశించిన నీలం మధు లాంటి నాయకులు బీఆర్ఎస్ పై యుద్ధం చేసినంత పనిచేశారు. ఈ నష్టాన్ని నివారించుకునేందుకు ఆ సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలకు బీఆర్ఎస్ అధినే త కేసీఆర్ కండువా కప్పేశారు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేత మామిళ్ల రాజేందర్ కు వీఆర్ఎస్ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంది. అదే సామాజికవర్గానికి చెందిన అంబర్ పేట్ శంకర్ కు కూడా కండువా కప్పేసింది.

సిద్దిపేటలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ ముదిరాజ్ లను ఆకట్టుకునేలా ప్రసంగించారు. తనకు ఓ  ముదిరాజ్ తల్లి పాలిచ్చి పెంచిందని, ఆమె  పాలు తాగిన తాను తెలంగాణ తెచ్చానని, మీ ముందు ఇలా నిలబడ్డానంటూ ఆ కమ్యూనిటీని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో ముదిరాజ్ సంఘానికి పెద్దదిక్కుగా వ్యవహరించిన కాసాని జ్ఞానేశ్వర్ చేరిక తమకు కలిసి వస్తుందని మరో వైపు బీఆర్ఎస్ భావిస్తున్నట్టు స మాచారం.