మూడు డెడ్​లైన్లు దాటినా నాలాల పనులు కాలే!

మూడు డెడ్​లైన్లు దాటినా నాలాల పనులు కాలే!
  • మూడు డెడ్​లైన్లు దాటినా నాలాల పనులు కాలే!
  • వానా కాలం నాటికి పూర్తవడం కష్టమే
  • కేబుళ్లు, వాటర్​, డ్రైనేజీ పైపులతో ఎక్కడికక్కడ పనులకు ఆటంకం
  • కో ఆర్డినేషన్ మీటింగ్​పెట్టాల్సిన ఉన్నతాధికారలు పట్టించుకోవట్లే

హైదరాబాద్, వెలుగు : వానాకాలంలో ముంపు సమస్య లేకుండా చేసేందుకు మొదలుపెట్టిన నాలాల అభివృద్ధి పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం ఎస్ఎన్​డీపీ(స్ట్రాటజిక్ నాలా  డెవలప్​మెంట్ ప్రోగ్రామ్) కింద చేపట్టిన 
నిర్మాణాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికే మూడుసార్లు డెడ్​లైన్ విధించినా ఫలితం లేదు. గ్రేటర్​వ్యాప్తంగా రూ.737.45కోట్లతో 37 పనులు చేయాలని ప్రతిపాదించగా, 35 పనులు మొదలయ్యాయి. ఇందులో ఇప్పటివరకు రసూల్​పురా నాలా, నాగోలులోని బండ్లగూడ చెరువు నుంచి నాగోల్​ చెరువు వరకు చేపట్టిన బాక్స్ డ్రెయిన్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినచోట్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని చివరి దశలో ఉండగా, మరికొన్ని మొదటి దశలోనే ఉన్నాయి. 2023 మార్చి నాటికి అన్ని నాలాలను అందుబాటులోకి తీసుకురావాలనే బల్దియా కమిషనర్ లోకేశ్​కుమార్​ఆదేశించినప్పటికీ ఆ మేరకు పనులు జరగలేదు. మెయిన్ ​రోడ్లపై చేయాల్సిన పనులకు పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోవడం,  పనులు చేసే టైంలో వివిధ రకాల కేబుళ్లు, వాటర్, డ్రైనేజీ లైన్లు అడ్డురావడంతో నెమ్మదిగా జరుగుతున్నాయి. అన్ని శాఖలతో కో ఆర్డినేషన్ మీటింగ్ పెట్టి నాలాల పనులకు అడ్డంకులు తొలగించాల్సిన ఉన్నతాధికారులు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో నేటికీ కొన్నిచోట్ల 20 శాతం పనులు కూడా కాలేదు.

నామమాత్రంగా పూడికతీత

భారీ వర్షాల టైమ్​లో క్షేత్రస్థాయిలో పర్యటించి హడావుడి చేస్తున్న మంత్రులు, అధికారులు, తగ్గుముఖం పట్టాక పట్టించుకోవడం లేదు. దీంతో ఏ యేటికాయేడు ముంపు సమస్య తీవ్రమవుతుంది. 1908, 1970, 2000, 2016, 2017, 2020, 2021 సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలకు సిటిలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నెలరోజులైనా వరదల నుంచి కోలుకోలేని కాలనీలు నేటికీ ఉన్నాయి. నాలాల వైడెనింగ్ పనులు చేపడుతున్నామంటూ రెండేళ్ల క్రితం ప్రకటించినప్పటికీ పూడికతీత నామమాత్రంగా సాగుతోంది. ఉన్న నాలాలను పట్టించుకోకపోవడంతో వానల టైమ్​లో వరద కాలనీల్లోకి చేరుతోంది. నాలాల పూడికతీత పనులు ఫిబ్రవరిలో ప్రారంభించాల్సి ఉండగా, ఏప్రిల్​లో టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వచ్చే వానాకాలం నాటికి కూడా నాలాల పనులు పూర్తికావడం కష్టంగానే కనిపిస్తోంది.

బ్రిడ్జిలు అంతే..

మూసీ, ఈసీ నదులపై ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే చోట రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిలను వెంటనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసి ఏడాది దాటినా పనులు ముందుకు సాగడం లేదు. భూసేకరణ పూర్తికాలేదు. రెవెన్యూ అధికారులు మొదట్లో హడావిడి చేసి వదిలేశారు. మూసీకి ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మూసారాంబాగ్, చాదర్​ఘాట్, ఇబ్రహీంబాగ్, అత్తాపూర్​లో రూ.168 కోట్లతో జీహెచ్ఎంసీ, మిగతా 11 చోట్ల రూ.377 కోట్ల ఫండ్స్​ని హెచ్ఎండీఏ ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో మూసారాంబాగ్, చాదర్​ఘాట్ బ్రిడ్జిల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ జలాశయాల గేట్లు ఎత్తిన ప్రతిసారి వీటి ప్రస్తావన వస్తుంది. తర్వాత పట్టించుకోవడం లేదు.