గులాబీ లిస్ట్ రెడీ?!

గులాబీ లిస్ట్ రెడీ?!
  • గులాబీ లిస్ట్ రెడీ?!
  • 51 లేదా 42 మందితో జాబితా
  • ఆరు సంఖ్య వచ్చేలా ఫస్ట్ లిస్ట్
  • నిజశ్రావణ మాసం కోసం వెయిటింగ్
  • 4 రోజులుగా ఫాంహౌస్ లో కేసీఆర్
  • సర్వే రిపోర్టులు క్రోడీకరించుకొని జాబితా
  • ఇప్పటికే 20–21 మందిని ప్రకటించిన కేటీఆర్, హరీశ్​, కవిత
  • ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్
హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సిద్ధమైందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నాలుగు రోజులుగా ఫాంహౌస్ లోజాబితాపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్టు సమాచారం. తాను చేయించిన నాలుగు సర్వేలను పరిగణనలోకి తీసుకొని, ప్రత్యర్థి బలాన్ని అంచనా వేసి దీటైన అభ్యర్థులను ప్రకటించేందుకు సీఎం సిద్ధమవుతున్నారు. తొలివిడుతగా 51 లేదా 42 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ తాను సెంటిమెంట్ గా భావించే ఆరు అంకె వచ్చేలా అభ్యర్థుల సంఖ్యను ప్రకటిస్తారని సమాచారం.
 
ప్రస్తుతం అధిక శ్రావణ మాసం నడుస్తుండటం.. ఇది శుభకార్యాలకు అనువైనది కాకపోవడంతోనే జాబితా ప్రకటనలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. సాధారణంగా అధికశ్రావణ మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. ఇది కేవలం దేవతార్చనలకు మినహా శుభకార్యాలకు ఉపయోపడదని పండితులు చెబుతున్నారు. ఈ సెంటిమెంట్లను బలంగా విశ్వసించే కేసీఆర్ నిజశ్రావణ మాసం ప్రారంభం కాగానే ఫస్ట్ లిస్ట్ ప్రకటించి పొలిటికల్ టూర్లకు శ్రీకారం చుడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు సీఎం అధికారిక కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారని అంటున్నారు.

20–21 మంది పేర్లుపై ఇప్పటికే స్పష్టత 

బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగనున్న 2‌0–21 మంది పేర్లను ఇది వరకే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. మిగతా మందిని వీరి పేర్లకు జోడించి జాబితా విడుదల చేస్తారా అన్నది అంతుచిక్కడం లేదు. మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, హైదరాబాద్ లోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా వచ్చే ఎన్నికల్లో దీవించాలంటూ పలువురి పేర్లను వేదికమీదే ప్రకటించారు. అలాగే ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురి పేర్లను ప్రస్తావించి వచ్చే ఎన్నికల్లో దీవించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ జిల్లాల్లో పర్యటన సందర్భంగా స్వయంగా కేసీఆర్ కూడా కొందరి పేర్లను ప్రస్తావించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రి హరీశ్​ రావు కూడా పలువురి పేర్లను సభల్లో ప్రస్తావించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పేర్లన్నీ కలిపి దాదాపు 20 నుంచి 21 మంది వరకు ఉంటాయి. వీళ్లందరికీ టికెట్లు కేటాయిస్తారా..? లేదా..? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయా సెగ్మెంట్లలో ఇద్దరు నుంచి నలుగురు టికెట్లు ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్ సర్వేలో వీళ్లందరికీ పాజిటివ్ గా వచ్చిందా..? లేదా..? ఏమైనా మార్పులుంటాయా..? అన్నది ఆసక్తికరంగా మారింది. 

సిట్టింగుల్లో గుబులు 

కేసీఆర్ ప్రకటించే ఫస్ట్ లిస్ట్ లో తమ పేర్లుంటాయా..? లేదా..? అన్న గుబులు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్నది. ఇప్పటికే పలు సెగ్మెంట్లలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇంకా కొందరికి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మరికొందరు అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇంకా కొందరు ఇతర పార్టీల నాయకులతో టచ్ లో ఉన్నట్టు అధినేతకు సమాచారం ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తమకు టికెట్టు వస్తుందా..? రాదా..? అన్న టెన్షన్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్నది.