టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దాదాగిరి వెనుక చాలా కథ!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దాదాగిరి వెనుక చాలా కథ!

ఎమ్మెల్యే దాదాగిరి వెనుక చాలా కథ!
రెండు నెలల నుంచి ఆఫీసర్లు, టీఆర్ఎస్​నేతల మధ్య వార్
ధరూర్ లో గురుకులం ఏర్పాటుకు ఆఫీసర్ల యత్నం
రూ. 5 లక్షలు ఇవ్వాలని టీఆర్ఎస్​ లీడర్ల డిమాండ్
డీల్ కుదరకపోవడంతో వేరే బిల్డింగ్​లో గురుకులం ఏర్పాటు

గద్వాల, వెలుగు :  టీఆర్ఎస్​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆఫీసర్​గల్లా పట్టుకున్న వ్యవహారం వెనుక చాలా కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి జిల్లా ఆఫీసర్లు, టీఆర్ఎస్ ​లీడర్ల మధ్య గురుకులం ఏర్పాటు విషయంలో రెండు నెలల నుంచి వార్ నడుస్తోంది. గద్వాలకు జ్యోతిరావు పూలే బాలికల బీసీ గురుకులం  ఆగస్టులో మంజూరైంది. దీంతో ధరూర్ మండల కేంద్రానికి సమీపంలో ఒక బిల్డింగులో స్కూల్ ఏర్పాటుకు గురుకులాల ఆఫీసర్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. నెలకు రూ. 1.5 లక్షలు కిరాయి చెల్లించాలి. బిల్డింగ్ ఓనరు 40 లెట్రిన్లు, బాత్రూంలు, క్లాస్ రూమ్స్ గ్రిల్ తదితర వాటికి దాదాపు రూ. ఏడు లక్షలు ఖర్చుపెట్టి స్కూలుకు అనుకూలంగా ఉండే విధంగా రెడీ చేశాడు. ఈ విషయం స్థానిక టీఆర్ఎస్ లీడర్లకు తెలిసింది.

స్కూల్ ఏర్పాటు చేయాలంటే తమకు రూ. 5 లక్షలు ఇవ్వాలని ఒక వర్గం డిమాండ్ చేసింది. టీఆర్ఎస్​లోని మరో వర్గం మూడున్నర లక్షలు ఇస్తే తామే ఎమ్మెల్యేతో మాట్లాడి ఒప్పిస్తామంటూ బిల్డింగ్ ఓనర్ తో బేరసారాలు చేశారు. ఇంతలో ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. తనకు చెప్పకుండా ధరూర్ లో ఎవరిని అడిగి స్కూల్ పెడుతున్నారంటూ ఆఫీసర్లపై విరుచుకుపడ్డారు. గద్వాల టౌన్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ను నెలరోజుల క్రితం షిఫ్ట్ చేసి అందులో జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. ట్రైబల్​వెల్ఫేర్​స్కూల్​ఉన్నపుడు కిరాయి రూ. 80 వేల కాగా ప్రస్తుతం రూ. 1.5 లక్షలు చెల్లించనున్నారు. ఈ బిల్డింగ్ టీఆర్ఎస్ కు అనుకూలమైన వ్యక్తిది కావడంతో అక్కడ ఏర్పాటు చేశారనే విమర్శలు ఉన్నాయి. 

వర్గ విభేదాలతో రచ్చ

గతం నుంచి ఎమ్మెల్యే, జడ్పీ చైర్​పర్సన్​సరిత మధ్య రాజకీయంగా పొసగడం లేదు. ఏ మీటింగ్ కు వచ్చినా ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. జడ్పీ మీటింగ్ లో కూడా గద్వాల జడ్పీటీసీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఫండ్స్​  కేటాయింపు, డెవలప్మెంట్ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. దీంతో రెండు మూడుసార్లు జడ్పీ మీటింగ్ లు సైతం వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి. మెజార్టీ జడ్పీ మీటింగులకు గద్వాల ఎమ్మెల్యే డుమ్మా కొడుతు వచ్చారు. ఇద్దరి మధ్య పంచాయితీ మినిస్టర్లు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ దృష్టికి వెళ్లినా పరిస్థితి మాత్రం మారలేదు. తాజాగా మంగళవారం గురుకుల పాఠశాల ఓపెనింగ్ టైంలోనూ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే వచ్చేసరికే జడ్పీ చైర్​పర్సన్​స్కూల్ గేట్ రిబ్బన్ కటింగ్ చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే తాను రాకుండానే ఎలా ఓపెనింగ్​ చేస్తారంటూ మండిపడ్డారు. అప్పటికే ఆఫీసర్లపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే ఒకరి గల్లా పట్టుకున్నారు. ఎమ్మెల్యే వచ్చేసరికి కేవలం గేటు మాత్రమే ఓపెన్ ​చేశారని, క్లాస్ రూమ్స్, ఆఫీస్ రూమ్స్ ఓపెనింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇవేం పట్టించుకోకుండా ఆఫీసర్లపై ఉద్దేశపూర్వకంగా విరుచుకుపడ్డారనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే రాకముందే రిబ్బన్ కటింగ్ చేయడం పొరపాటని జడ్పీ చైర్ పర్సన్ స్వయంగా చెప్పినా కావాలనే రచ్చ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై జడ్పీ చైర్​పర్సన్ ​హైకమాండ్​కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 

బిల్డింగ్ రెడీ చేసినా స్కూల్ పెట్టలే

రూ. 7 లక్షలు ఖర్చుపెట్టి పై అంతస్తుకు స్లాబ్ వేయించి 40 బాత్రూములు కట్టించా. స్కూలుకు అన్నీ రెడీ చేస్తే.. అప్పటికే అగ్రిమెంట్​ అయినప్పటికీ ఏర్పాటు చేయలేదు. రాజకీయ లీడర్ల స్వార్థానికి నేను బలైపోయా. ఇప్పుడు మరో స్కూల్ వస్తే పరిశీలన చేస్తామంటూ చావు కబురు చల్లగా చెబుతున్నారు. 
- మల్లికార్జున్, ధరూర్ బిల్డింగ్ ఓనర్