
ఈ నెల 18వ తేదీన కరీంనగర్ లో ఐటీ టవర్ ప్రారంభం కానుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ టవర్ ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఐటీ టవర్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సోమవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలకే ఐటీ టవర్ లో అవకాశముందని చెప్పిన కమలాకర్.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇన్సెంటివ్ లు ఇస్తున్నామన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు కూడా కరీంనగర్ వస్తాయని ఆశిస్తున్నామన్నారు. తొలి రోజునే దాదాపు 400 మంది ఉద్యోగులు కరీంనగర్ ఐ.టి. టవర్ లో పని ప్రారంభిస్తారు.మరో టవర్ కోసం 3 ఎకరాలు సిద్ధంగా ఉంచామన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే కరీంనగర్ లో ఐ.టి. టవర్ నిర్మించామని, హైదరాబాద్ లో పనిచేసే ఐ.టి. ఉద్యోగికి, కరీంనగర్ ఐ.టి. ఉద్యోగికి 30 వేల రూపాయల జీవన వ్యయం ఆదా అవుతుందని చెప్పారు గంగుల. మొత్తం 26 కంపెనీలు తమను సంప్రదించాయని, 15 కంపెనీలతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు. దాదాపు 3000 నుంచి 3600 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని, 80 శాతం ఉద్యోగాలు కరీంనగర్ వాళ్లకేనని చెప్పారు.
హై ఫ్రీకెన్సీ ఇంటర్ నెట్, నిరంతర విద్యుత్, పవర్ బ్యాక్ అప్ జనరేటర్ సెంట్రలైజ్డ్ ఏసీ వంటి అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నామని, “కేసీఆర్ ఉండగా .. గల్ఫ్ ఎందుకు దండుగ” నినాదంతో పని చేస్తున్నామని చెప్పారు మంత్రి గంగుల.
2014 లో తెలంగాణ వచ్చినప్పుడు ఎంతో మంది అభివృద్ధిపై అనుమానాల వ్యక్తం చేసారు. వాటిని పటాపంచలు చేస్తూ అనేక పనులు సీఎం చేసి చూపిస్తున్నారన్నారు వినోద్ కుమార్. కంప్యూటర్ శిక్షణ ఇస్తే చాలనుకునే పరిస్థితి నుంచి ఐటీ కంపెనీలు స్థాపించే స్థాయికి కరీంనగర్ ఎదిగిందన్నారు. తక్కువ జీవన వ్యయంతో ఐటీ ఉద్యోగులకు కరీంనగర్ అనుకూలంగా మారబోతోందని చెప్పారు.