బడ్జెట్ లెక్క తప్పింది.. పోయినేడాది అంచనాలు తలకిందులు 

బడ్జెట్ లెక్క తప్పింది.. పోయినేడాది అంచనాలు తలకిందులు 
  • రూ.2.19 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం
  • మార్చి చివరి నాటికి చేసింది రూ.1.70 లక్షల కోట్లే 
  • ఆదాయం అంచనా 2.45 లక్షల కోట్లు.. వచ్చింది 1.92 లక్షల కోట్లే 
  • వివిధ స్కీముల నిధుల్లో భారీగా కోత పెట్టిన సర్కార్ 
  • కాగ్ తాజా రిపోర్టులో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ బడ్జెట్ లెక్క మళ్లా తప్పింది. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న బడ్జెట్అంకెలు ఉత్తవేనని తేలింది. పోయిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ.2.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని, అందులో రూ.2.19 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఆదాయం రూ.1.92 లక్షల కోట్లే రాగా, మార్చి చివరి నాటికి1.70 లక్షల కోట్లే ఖర్చు చేసింది. అంటే అనుకున్న ఆదాయంలో రూ.53 వేల కోట్ల లోటు ఏర్పడగా, ఖర్చు చేయాల్సిన నిధుల్లో రూ.49 వేల కోట్ల లోటు ఏర్పడింది. ఈ వివరాలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా రిపోర్టులో వెల్లడించింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, లిక్కర్, జీఎస్టీ, ఇతర పన్ను రాబడులు అనుకున్నంతగానే వచ్చినా..  నాన్ ట్యాక్స్ రెవెన్యూ, గ్రాంట్​ఇన్​ఎయిడ్​లో వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన దాంట్లో భారీగా తగ్గించింది. సంక్షేమ పథకాల్లో కోత విధించింది. కొన్ని ముఖ్యమైన స్కీములను అసలు మొదలే పెట్టలేదు.

ఆ ఐదింటిలో తప్పిన అంచనాలు.. 

ఎందులో ఎంత ఆదాయం వస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఉన్నప్పటికీ, ఆయా అంశాల్లో ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుందని బడ్జెట్ లెక్కల్లో ప్రభుత్వం చూపింది. నిజానికి గత కొన్నేండ్లుగా ఆయా అంశాల్లో రాబడి అనుకున్నంత లేనప్పటికీ గొప్పలకు ఎక్కువ చూపింది. నాన్​ట్యాక్స్​రెవెన్యూ, గ్రాంట్​ఇన్​ఎయిడ్, అప్పులు, స్టాంప్స్ అండ్​ రిజిస్ర్టేషన్స్, సేల్స్ ట్యాక్స్ ద్వారా భారీ ఆదాయం వస్తుందని అంచనా వేయగా టార్గెట్ రీచ్ కాలేదు. నాన్​ట్యాక్స్​రెవెన్యూలో భూముల అమ్మకంతోనే ఎక్కువ మొత్తం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం రూ.25,421 కోట్ల ఆదాయం వస్తుందని అనుకుంటే రూ.19,553 కోట్లు మాత్రమే వచ్చింది. గ్రాంట్​ఇన్​ఎయిడ్​లో రూ.41 వేల కోట్లు టార్గెట్ పెట్టుకుంటే, రూ.13,179 కోట్లకే పరిమితమైంది. ఇక అప్పుల కింద ఏకంగా రూ.50 వేల కోట్లు సేకరిస్తామని సర్కార్ అంచనా వేయగా, చివరకు రూ.33 వేల కోట్లు మాత్రమే సేకరించగలిగింది. అప్పులు తీసుకునేందుకు కేంద్రం, ఆర్బీఐ విధించిన కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా అప్పులు ఎక్కువ తీసుకుంటామని ప్రభుత్వం బడ్జెట్​లో పేర్కొంది. చివరకు నిబంధనలకు అనుగుణంగానే తీసుకోవాల్సి వచ్చింది. కాగా, సర్కార్ కు లిక్కర్​ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. అనుకున్న దానికంటే రూ.వెయ్యి కోట్లు అదనంగా వచ్చింది. రూ.17,500 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే, రూ.18,470 కోట్ల ఆమ్దానీ వచ్చింది.

స్కీములకు ఇచ్చింది రూ.57 వేల కోట్లే

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో తెలిసి కూడా ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో చేస్తున్న గోల్​మాల్​తో అనేక స్కీమ్​ నిధుల్లో భారీగా కోత పడింది. కాగ్ రిపోర్ట్​ ప్రకారం ప్రభుత్వం రూ.2.19 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, అందులో రూ.1.70 లక్షల కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. రూ.49 వేల కోట్లు ఖర్చు చేయలేదు. ఇందులో స్కీములకే భారీగా నిధులు ఇవ్వకుండా ఆపింది. వివిధ పథకాల కింద రూ.93 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.57 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. దీంతో కొన్ని స్కీమ్​లు అసలు పట్టాలెక్కలేదు. ఈ లిస్ట్​లో దళితబంధు, గృహలక్ష్మి, రుణమాఫీ వంటివి ఉన్నాయి. ఆసరా పెన్షన్లు కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలను ముందు తక్కువగా చూపి చివరకు రూ.2 వేల కోట్లు ఎక్కువ కట్టింది.