మరో 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు

మరో 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది వాతావరణశాఖ. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపిపంది. అల్ప పీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. జగిత్యాల జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. జగిత్యాల-ధర్మపురి మార్గంలో అనంతారం దగ్గర వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి చెరువు మత్తడి దూకుతుండగా..సారంగపూర్ మండలం కోనాపూర్ దగ్గర వాగు  ఉదృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోకి  వరద నీరు చేరింది.  సిరిసిల్లలోని శాంతినగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరమగ్గాల పరిశ్రమల్లోకి నీరు చేరడంతో నేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. వేములవాడ మల్లారం మధ్య వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

భారీగా కురుస్తున్న వర్షాలతో రెండు బేసిన్లలోని ప్రాజెక్టులు పూర్తి స్థాయి జలకళను సంతరించుకున్నాయి. ఎగువన మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో….శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి 74 వేల 895 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ..మొత్తం 16 గేట్లు ఎత్తి దాదాపు 50వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మోయ తుమ్మెదవాగు నుంచి భారీగా వరద కొనసాగుతుండడం, ఎగువన మిడ్ మానేర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో ముందు జాగ్రత్తగా లోయన్ మానేర్ డ్యాం అన్ని గేట్లను ఎత్తారు అధికారులు. ఒక్కో గేటు నుంచి 2వేల క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు. అటు మిడ్ మానేరు ప్రాజెక్టులోకి కూడా 28 వేల 829 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మిడ్ మానేరు ప్రాజెక్టు సామర్థ్యం 25.873 టీఎంసీలకు గానూ.. 25.06 టీఎంసీలు నీరు చేరింది. దీంతో ప్రాజెక్ట్ ఆరు గేట్లను ఎత్తారు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. 15వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

ప్రాణహిత నదికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తి వరదను గోదావరిలోకి వదులుతున్నారు. బ్యారేజీలో 10 టీఎంసీల వరకు నీటి నిల్వను మెయింటెన్ చేస్తూ మిగిలిన నీటిని కిందకు వదిలిన ఇంజినీర్లు…తర్వాత మేడిగడ్డలో నిల్వను తగ్గించారు. బ్యారేజీలోకి 62 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా..46 గేట్లు ఎత్తి 82 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి 29 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా 25 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు.

అటు కృష్ణా ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద వస్తుండడంతో జూరాల  ప్రాజెక్టుకు గంట గంటకు వరద ఉదృతి పెరుగుతోంది. ప్రాజెక్టుకు లక్షకు పైగా క్యూసెక్కుల వరద వస్తుండటంతో 11 గేట్లు ఎత్తి నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్లలో 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా… ప్రస్తుతం 318.330 మీటర్లకు నీరు చేరింది.

ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల 26 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో ….9 గేట్లు ఎత్తి 2.54 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు… ప్రస్తుతం 884.50 అడుగులకు నీరు చేరింది. అటు శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జున సాగర్ 14 గేట్లను ఎత్తారు అధికారులు. ప్రాజెక్టుకు 2 లక్షల 48 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా…అంతేస్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఒకే సీజన్లో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారని ఇంజినీర్లు చెప్తున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్ట్ కు వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు అదికారులు. ఎగువ నుంచి 16 వేల 770 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 5 గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.