
- రానున్న కొన్నేండ్లలో ఇన్వెస్ట్ చేస్తామన్న కంపెనీ చైర్మన్ సంజయ్ పురి
- ఫుడ్ టెక్ సర్వీస్‌ను విస్తరించే ప్లాన్
- ఎఫ్‌ఎంసీజీ బిజినెస్ భేష్.. పేపర్ బోర్డ్స్‌కు కష్టాలు
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ, సిగరెట్స్ వంటి వివిధ బిజినెస్‌లలో ఉన్న ఐటీసీ లిమిటెడ్ రానున్న కొన్నేళ్లలో రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ఎమర్జెంగ్ సెక్టార్లలో విస్తరించడానికి ఈ పెట్టుబడి పెడతామని కంపెనీ చైర్మన్ సంజీవ్ పురి శుక్రవారం తెలిపారు. వర్చువల్‌గా జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీసీ ఇటీవల రూ.4,500 కోట్లతో ఎనిమిది ప్రపంచ స్థాయి తయారీ ప్లాంట్లను నిర్మించిందని పూరి షేర్‌హోల్డర్లకు వివరించారు. "రానున్న కొన్నేళ్లలో వివిధ వ్యాపారాల్లో రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని ఐటీసీ చూస్తోంది" అని చెప్పారు. కానీ, ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి పూర్తి వివరాలను బయటపెట్టలేదు.
ఐటీసీ నెక్స్ట్ స్ట్రాటజీలో భాగంగా పెట్టుబడి పెట్టనున్నారు. ఎఫ్‌ఎంసీజీ , సస్టైనబుల్ ప్యాకేజింగ్, ఎగుమతి చేయగలిగే వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాల్లో ఈ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. “ఐటీసీ 40 అత్యాధునిక తయారీ ప్లాంట్లను నిర్మించింది. 250 ఫ్యాక్టరీలు, 7,500 ఎంఎస్‌ఎంఈలతో కూడిన బలమైన ఈకోసిస్టమ్‌ను డెవలప్ చేసింది”అని పురి అన్నారు. ఐటీసీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో సాయపడుతోందని చెప్పారు.
మొదట ఇండియా..
"భారతీయ బ్రాండ్‌లు మొదట భారత్‌లో పూర్తిగా విస్తరించాలి. ఆ తర్వాత విదేశాల్లో ప్రభావం చూపాలని మేము నమ్ముతున్నాం," అని పూరి తెలిపారు. ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ బిజినెస్ సేల్స్ ప్రస్తుత ఏడాదిలో రూ.34 వేల కోట్లను దాటుతుందని అంచనా. మొత్తం 26 కోట్ల ఇండ్లకు చేరుతూ, 70 అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించామని పురి అన్నారు. ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ గత ఏడాది హెల్త్, నూట్రిషన్, శుభ్రత, నేచురల్స్ వంటి విభాగాల్లో 100 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. 24 మంత్ర ఆర్గానిక్, ప్రసుమ, యోగా బార్, మదర్ స్పర్శ్ వంటి బ్రాండ్లను కూడా కొనుగోలు చేసింది. పేపర్‌బోర్డ్స్, ప్యాకేజింగ్ వ్యాపారం గురించి మాట్లాడుతూ, " చౌక దిగుమతుల డంపింగ్, కలప రేట్లు పెరగడం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది" అని పురి చెప్పారు. ప్రభుత్వం ఇండస్ట్రీని రక్షించే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్ విస్తరణ..
ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐటీసీ, ఈ బిజినెస్‌ను విస్తరించాలని చూస్తోంది. ఐటీసీ నెక్స్ట్ వ్యూహంలో ఇది కీలకమైనదని పూరి అన్నారు. ఫుడ్-టెక్ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పారు. " ఐటీసీకి చెందిన ఫుడ్, హోటల్స్, డిజిటల్ టెక్నాలజీల బలాలను ఉపయోగించి ఈ కొత్త వ్యాపారాన్ని డెవలప్ చేస్తాం" అని ఆయన వివరించారు. ఈ వ్యాపారం ఐటీసీ మాస్టర్ షెఫ్ క్రియేషన్స్, ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్, సన్‌ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్, సాన్షో బై ఐటీసీ మాస్టర్ షెఫ్ అనే నాలుగు బ్రాండ్‌ల కింద ఐదు నగరాల్లో 60 క్లౌడ్ కిచెన్‌లను ఇప్పటికే స్థాపించింది. ఈ వ్యాపారం మూడేళ్లలో ఏడాదికి 108శాతం గ్రోత్ నమోదు చేసింది, దేశవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది.