‘బిల్ట్‌‌‌‌’ ప్లేస్‌‌‌‌లో కొత్త కంపెనీ !

‘బిల్ట్‌‌‌‌’ ప్లేస్‌‌‌‌లో కొత్త కంపెనీ !
  • వేగంగా పాత ఫ్యాక్టరీ శిథిలాల తొలగింపు ప్రక్రియ
  • 2014లో మూతపడిన కంపెనీ
  • అదే జాగాలో కొత్త కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు
  • ఐటీసీ ఆధ్వర్యంలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటని ప్రచారం
  • భూసర్వే త్వరగా కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయాలని మంత్రి సీతక్క ఆదేశం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/మంగపేట, వెలుగు: గతంలో మూతపడిన బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ స్థానంలో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పాత కంపెనీ స్థలంలోనే కొత్తది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఓల్డ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ శిథిలాల తొలగింపు పనులను ముమ్మరం చేశారు. దీంతో పాటు భూ సర్వే సైతం చేపట్టింది.శిథిలాల తొలగింపు, భూ సర్వే పనులు పూర్తికాగానే ఐటీసీ గానీ మరే ఇతర సంస్థ ద్వారా గానీ కొత్త ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రి సీతక్క మూతపడ్డ బిల్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీని ఇటీవల సందర్శించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

తెలంగాణ ఏర్పడ్డాక మూతపడిన తొలి ఫ్యాక్టరీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూత పడిన తొలి ఫ్యాక్టరీ బిల్ట్‌‌‌‌. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌‌‌‌లో 1975లో ఈ  ఫ్యాక్టరీని స్థాపించారు. అవంతా గ్రూప్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కంపెనీస్‌‌‌‌కు చెందిన బల్లార్‌‌‌‌పూర్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్ (బిల్ట్) సంస్థ ఈ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇక్కడ రోజుకు 267 టన్నుల పేపర్‌‌‌‌ గుజ్జు (పల్ప్‌‌‌‌) ఉత్పత్తి జరిగేది. 705 మంది పర్మినెంట్‌‌‌‌ కార్మికులు, సుమారు రెండు వేల మంది కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికులు పనిచేసేవారు.

అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పల్ప్‌‌‌‌ చాలా తక్కువ ధరకు వస్తుందంటూ ఇక్కడ తయారయ్యే ముడి సరుకును కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నష్టం వస్తుందంటూ 2014 ఏప్రిల్‌‌‌‌లో బిల్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీని మూసివేయడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకునే అవకాశం లేకపోవడంతో నేషనల్‌‌‌‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌టీ) ఇచ్చిన ఆర్డర్స్‌‌‌‌ ప్రకారం కార్మికులకు చెల్లింపులు జరిగాయి. మూతపడిన బిల్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీని ఇతరులకు అమ్మేసే విషయమై కార్మికులకు సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ చేశారు. చట్ట ప్రకారం 1,926 మంది ఎంప్లాయీస్‌‌‌‌, కార్మికులకు రూ.9.49 కోట్లు చెల్లించారు. 

శిథిలమైన మెషినరీని అమ్మేసిన ఫిన్‌‌‌‌క్విస్ట్‌‌‌‌ సంస్థ

బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన మొదట్లో రోజుకు 130 టన్నుల పల్ప్‌‌‌‌ ఉత్పత్తి చేసేవారు.1994 – 95 సంవత్సరంలో కంపెనీలోని పాత మెషీన్లను తొలగించి జపాన్‌‌‌‌, ఫిన్లాండ్‌‌‌‌, స్వీడన్‌‌‌‌ దేశాల నుంచి కొత్త మెషినరీని తీసుకొచ్చి ఫ్యాక్టరీని ఆధునికీకరించారు. ఆ తర్వాత రోజుకు 267 టన్నుల పేపర్‌‌‌‌ గుజ్జు ఉత్పత్తి జరిగేది.

2014లో ఈ ఫ్యాక్టరీ మూత పడడంతో పట్టించుకునేవారు లేక, సరైన మెయింటెనెన్స్‌‌‌‌ లేకపోవడంతో మెషీన్లు తుప్పు పట్టాయి. శిథిలమైన మిషనరీ, ఇతర వస్తువులను ఫిన్‌‌‌‌క్విస్ట్‌‌‌‌ కంపెనీ తూకం లెక్కన అమ్మేసింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 50 మంది కూలీలు స్థానికంగా ఉంటూ వేలాది టన్నుల శిథిలాలను తొలగించే పనులు చేస్తున్నారు. 

సర్వే త్వరగా కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయాలని మంత్రి ఆదేశం

మూతపడ్డ బిల్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఈ నెల 6న పరిశీలించారు. మిషనరీ శిథిలాల తొలగింపుతో పాటు భూ సర్వే పనులను స్పీడప్‌‌‌‌ చేయాలని కలెక్టర్‌‌‌‌తో పాటు ఇతర ఆఫీసర్లను ఆదేశించారు. బిల్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ మూతపడడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, మళ్లీ ఇక్కడ కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ములుగు నియోజకవర్గ ప్రజలకు, కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మంత్రి చెప్పారు. మూతపడిన బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ విషయాన్ని గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో చాలా సార్లు ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

619 ఎకరాల్లో కొత్త పరిశ్రమ

 బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న 619 ఎకరాల్లో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సర్కార్‌‌‌‌ భావిస్తోంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఇండియన్‌‌‌‌ టొబాకో కంపెనీ (ఐటీసీ) ఆధ్వర్యంలో రూ.5,500 కోట్ల పెట్టుబడితో పేపర్‌‌‌‌ గుజ్జు ఫ్యాక్టరీ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఐటీసీ సంస్థకు భద్రాచలం ఏరియాలో పేపర్‌‌‌‌ గుజ్జు తయారీ పరిశ్రమ ఉంది. ములుగు జిల్లా కమలాపూర్‌‌‌‌ ఏరియాలో బిల్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీకి పెద్ద మొత్తంలో భూములు ఉన్నాయి. దీంతో ఇక్కడ పేపర్‌‌‌‌‌‌‌‌ గుజ్జు తయారీ కోసం 8వ ఫ్యాక్టరీని లాంచ్‌‌‌‌‌‌‌‌ చేయాలని ఐటీసీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని సర్కారు పెద్దలతో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నట్లుగా కార్మికులు చెబుతున్నారు. 

గత ప్రభుత్వం పట్టించుకోలే

బిల్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ తెరిపించే విషయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంది. కొత్త కంపెనీ ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం.ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది.
-చింత పున్నారావు, కమలాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామస్తుడు