ఆదివాసీ మహిళలు స్వశక్తితో ఎదగాలి : ఐటీడీఏ పీవో రాహుల్

ఆదివాసీ మహిళలు స్వశక్తితో ఎదగాలి : ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, వెలుగు : ఆదివాసీ మహిళలు స్వశక్తితో ఎదగాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ పిలుపునిచ్చారు. చర్ల మండలంలోని సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీముత్యాలమ్మ జాయింట్​ లియబిలిటీ గ్రూపునకు చెందిన ఆదివాసీ గిరిజన మహిళలకు సోమవారం ఐటీడీఏలో లక్ష రూపాయల విలువ చేసే సామాగ్రిని అందజేసిన అనంతరం ​ఆయన మాట్లాడారు. అందుబాటులో ఉన్న అటవీ ఉత్పత్తుల సాయంతో ఆహార పదార్థాలను తయారు చేసి అమ్ముతూ.. ఆదాయం పెంచుకోవాలన్నారు.

 ఈ గ్రూపు ఇప్ప పువ్వుతో లడ్డూ, బర్ఫీ, ఇప్పనూనె, న్యూట్రిషన్  పదార్థాలను తయారు చేస్తుండగా, వాటిని తయారు చేసేందుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి ఐటీడీఏ ద్వారా పీవో అందజేశారు. ఒకరిపై ఆధారపడకుండా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారం పెంచుకోవాలని సూచించారు. చిన్న తరహార పరిశ్రమలను అభివృద్ధి చేసుకుని, తోటి ఆదివాసీలకు కూడాఉపాధి చూపించాలని తెలిపారు.

 ఆదివాసీల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు..  

 గిరిజన సంక్షేమానికి యూనిట్​ ఆఫీసర్లంతా కృషి చేయాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ఆదేశించారు. గిరిజన దర్బారులో భాగంగా సోమవారం ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీల నుంచి సమస్యలతో కూడిన ఆర్జీలను స్వీకరించి యూనిట్ ఆఫీసర్లతో మాట్లాడారు. ప్రభుత్వ స్కీమ్​లు ప్రతీ ఆదివాసీకి చేర్చే బాధ్యత యూనిట్​ ఆఫీసర్లదేనన్నారు.   

ఆర్జీల ఆధారంగా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు,భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, పంట పొలాల్లో సోలార్​ విద్యుత్​ కనెక్షన్లు,ట్రైకార్​ ద్వారా సబ్సిడీ రుణాలు, బోర్లు, విద్యుత్​ సౌకర్యం,జీవనోపాధికి రుణాల కోసం ఎక్కువగా ఆర్జీలు వచ్చాయి. ప్రతీ ఆర్జీని ఆన్​లైన్​లో పొందుపరచాలన్నారు. విడతలవారీగా పరిష్కారం చేయాలన్నారు.