2025-26 అసెస్‌మెంట్ ఇయర్ (ఫైనాన్షియల్ ఇయర్ 2024-25) కోసం దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ రిఫండ్‌ల విషయంలో పన్ను చెల్లింపుదారుల్లో ఆందోళన నెలకొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం దాదాపు 7.84 కోట్ల రిటర్న్‌లు దాఖలు కాగా.. ఇప్పటివరకు 7.09 కోట్ల రిటర్న్‌లు ప్రాసెస్ అయ్యాయి. అంటే దాదాపు 90 శాతం రిటర్న్స్ ప్రాసెసింగ్ ముగిసినప్పటికీ ఇంకా 75 లక్షల రిటర్న్‌లు అండర్ ప్రాసెసింగ్ స్టేటస్ కింద ఉన్నట్లు తేలింది.
సాధారణంగా ఐటీఆర్‌ను ఈ-వెరిఫికేషన్ చేసిన తర్వాత 2-5 వారాల్లో రిఫండ్ ఖాతాలో జమ అవుతుంది. కానీ ఈ ఏడాది కొన్ని కారణాల వల్ల రిఫండ్‌ల జారీ ఆలస్యమవుతోంది. అయితే సరైన రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ను 2025 డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని సీబీడీటీ ఇటీవల ప్రకటించడం పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం కలిగించే విషయం.
ఆలస్యానికి ప్రధాన కారణాలు..?
1. డేటా తేడాలు: మీరు దాఖలు చేసిన రిటర్న్‌లో పేర్కొన్న ఆదాయం, మినహాయింపులు, TDS వివరాలు.. ఫామ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ లేదా ఫామ్ 16లలోని వివరాలతో సరిపోలకపోతే ఆ రిటర్న్‌లు అదనపు పరిశీలన కోసం నిలిపివేయబడతాయి.
2. ఈ-వెరిఫికేషన్ పూర్తికాకపోవడం: రిటర్న్‌ను దాఖలు చేసిన 30 రోజుల్లోగా ఈ-వెరిఫై చేయకపోతే.. అది చెల్లనిదిగా పరిగణించబడుతుంది.
3. బ్యాంక్ ఖాతా సమస్యలు: రిఫండ్‌లు కేవలం పాన్-లింక్డ్, ప్రీ-వ్యాలిడేట్ చేయబడిన బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయి. ఖాతా వివరాలు తప్పుగా ఉండటం లేదా ఖాతా చెల్లుబాటులో లేకపోవడం వల్ల రిఫండ్ ఫెయిల్ అవుతుంది.
4. అదనపు పరిశీలన: పెద్ద మొత్తంలో క్లెయిమ్‌లు లేదా విదేశీ ఆదాయం, మూలధన లాభాలు వంటి సంక్లిష్టమైన అంశాలు ఉన్న రిటర్న్‌లకు మరింత లోతైన పరిశీలన అవసరం.
5. గత బకాయిలు: గత అసెస్‌మెంట్ ఇయర్‌లకు సంబంధించి ఏవైనా పన్ను బకాయిలు ఉంటే.. రిఫండ్‌ను ఆ బకాయిలకు సర్దుబాటు చేస్తారు.
రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
ముందుగా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ (incometax.gov.in) లో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత View Filed Returnsపై క్లిక్ చేసి 'e-File' > 'Income Tax Returns' > 'View Filed Returns' ఆప్షన్‌కు వెళ్లండి. ఇక్కడ సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ (AY 2025-26) ఎంచుకుని.. 'View Details' క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిటర్న్ స్థితి ప్రాసెస్డ్ లేదా పెండింగ్ గురించి ఉంటుంది.
►ALSO READ | జాన్సన్ & జాన్సన్‌కు భారీ షాక్: బేబీ పౌడర్ కేసులో రూ.360 కోట్లు ఫైన్ వేసిన కోర్టు
మీ రిఫండ్ ఆలస్యం అవుతున్నట్లు తేలితే.. నోటీసులకు తక్షణమే స్పందించడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసుకోవడం, ఇ-నివారణ్ ద్వారా ఫిర్యాదు చేయడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. గడువులోగా రిటర్న్ దాఖలు చేసి జాప్యం జరిగితే, రిఫండ్ మొత్తంపై సెక్షన్ 244A ప్రకారం వడ్డీ కూడా చెల్లించబడుతుంది.

