
- టెన్త్ మ్యాథ్స్ పేపర్లో మార్కులు కలపట్లే!
- తెలుగు, బయాలజీ, ఇంగ్లిష్‌లో ఒక్కో మార్కు యాడ్
- ఎస్సెస్సీ బోర్డుకు సబ్జెక్టుల ఎక్స్పర్ట్ కమిటీల రిపోర్టులు
- మ్యాథ్స్ ప్రశ్నపత్రంలో తప్పుల్లేవని ప్రకటన
హైదరాబాద్, వెలుగు : టెన్త్ ఎగ్జామ్స్‌లో తెలుగు, బయాలజీ, ఇంగ్లిష్‌లో ఒక్కో మార్క్ యాడ్ చేయాలని ఆయా సబ్జెక్టుల ఎక్స్పర్ట్ కమిటీలు ఎస్సెస్సీ బోర్డుకు రిపోర్టు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వ పరీక్షల విభాగం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఇక మ్యాథ్స్ ఎగ్జామ్ మాత్రం స్టూడెంట్లను భయపెడుతున్నది. పేపర్ టఫ్‌గా రావడంతో పాటు క్వశ్చన్లు ఔటాఫ్ సిలబస్ ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని క్వశ్చన్లు తప్పుగా వచ్చాయనే ఆరోపణల నేపథ్యంలో.. మార్కులు కలుస్తాయని ఆశపడ్డారు. కానీ, క్వశ్చన్ పేపర్లో ఎలాంటి తప్పుల్లేవని, మార్కులు కలపాల్సిన అవసరం లేదంటూ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ కమిటీ ఎస్సెస్సీ బోర్డుకు సూచించింది. దీంతో మ్యాథ్స్‌లో మార్కులు కలిసే అవకాశం లేదు.
మ్యాథ్స్‌లో టెన్ జీపీఏ కష్టమే
టెన్త్ స్టూడెంట్లకు ఈసారి మ్యాథ్స్ సబ్జెక్టులో టెన్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) రావడం కష్టమేనని టీచర్లు చెబుతున్నారు. బ్లూప్రింట్, వెయిటేజీని పరిగణనలోకి తీసుకోకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో శనివారం టెన్త్ మ్యాథమేటిక్స్ ఎగ్జామ్ జరిగింది. ఈసారి పార్ట్ ఏ 80 మార్కుల క్వశ్చన్ పేపర్ కావడంతో పాటు, మొదటి రెండు సెక్షన్లలో ఎలాంటి ఛాయిస్ లేదు. వీటిలో నాలుగు క్వశ్చన్లలో మూడు కఠినంగా.. స్థాయిని మించి ఇచ్చారని, ఒక క్వశ్చన్ తప్పుగా వచ్చిందని టీచర్లు చెబుతున్నారు. సెక్షన్ 3లోనూ ఒక క్వశ్చన్ డిఫికల్ట్ గా ఉందని, ఒక క్వశ్చన్ ఈజీగానే ఉన్నా, ఎక్కువ టైమ్ తీసుకునేదిగా ఉందని పేర్కొంటున్నారు. మరోపక్క పార్ట్–బీలోనూ లెన్తీ క్వశ్చన్లు వచ్చాయని చెబుతున్నారు. దీంతో మ్యాథ్స్‌లో వంద మార్కులు రావడం కష్టమని తెలుస్తున్నది. 91 నుంచి 100 మధ్య మార్కులు వస్తే.. పది గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. చాలా మంది యావరేజ్ స్టూడెంట్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి.. గ్రేస్ మార్కులు కలపాలని టీచర్లు కోరుతున్నారు. అన్ని పేపర్స్‌లోనూ క్వశ్చన్ల వారీగా సబ్జెక్టు ఎక్స్ పర్ట్ టీమ్ వెరిఫై చేస్తున్నదని, కమిటీ రిపోర్టు ఆధారంగానే మార్కులపై నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ లింగయ్య తెలిపారు. మ్యాథ్స్‌లోనూ కమిటీ రిపోర్టు ఆధారంగానే ముందుకు పోతున్నామని చెప్పారు.
టెన్త్‌లో ఏడుగురు స్టూడెంట్లు డిబార్
టెన్త్ సైన్స్ ఎగ్జామ్‌లో ఏడుగురు స్టూడెంట్లు డిబారయ్యారు. వీరిలో హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ జడ్పీహెచ్ఎస్ (గర్ల్స్) సెంటర్లో ఐదుగురు, నిజామాబాద్ జిల్లా వర్నిలోని సెంటర్లో ఇద్దరు స్టూడెంట్లు ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ లింగయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 4,86,829 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 4,84,921 మంది హాజరయ్యారని చెప్పారు. ప్రైవేటు స్టూడెంట్లు కూడా 4,589 మందికి గానూ 3,778 మంది అటెండ్ అయ్యారని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వర్ని కాలేజీ సెంటర్లో ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. ధర్మసాగర్ సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించారు.