మోదీ అధిగమించాల్సింది.. ట్రంప్​ జోక్యాన్నే: మోదీ ముందున్న ప్రశ్నలివే..

మోదీ అధిగమించాల్సింది..  ట్రంప్​ జోక్యాన్నే: మోదీ ముందున్న ప్రశ్నలివే..

నిన్న రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్​తో కాల్పుల విరమణ నేపథ్యంలో జాతిని ఉద్దేశిస్తూ మాట్లాడిన విషయాలను క్లుప్తంగా చెప్పాలంటే..  పాకిస్తాన్​ తీవ్రవాద స్థావరాలను విధ్వంసం చేసిన తీరు, మన భద్రతా దళాల పోరాటపటిమను కొనియాడారు.   దిక్కుతోచని పాకిస్తాన్​ 10వ తేదీన మన డీజీసీ​ఎంఓతో ఆన్​లైన్​లో కాల్పుల విరమణకు దిగొచ్చారని చెప్పారు. ఆపరేషన్​ సిందూర్​ను తాత్కాలికంగా ఆపేశాం కానీ శాశ్వతంగా ఆపేయలేదన్నారు. ​ 

అణు బ్లాక్​ మెయిల్​ను  భారత్​ సహించదన్నారు.  టెర్రర్​  ఔర్​  టాక్స్​ ఏక్​సాథ్​ నహీ హోసక్తే. టెర్రర్​  ఔర్​  ట్రేడ్​ ఏక్​సాథ్​ నహీ హోసక్తే. పానీ ఔర్​ ఖూన్​ ఏక్​సాథ్​ నహీ బహెసక్తే అంటూ భారత్​ వైఖరికి స్పష్టత ఇచ్చారు.  అత్యంత కీలకమైన విషయం ఏం చెప్పారంటే.. ‘విశ్వ సముదాయ్​ సే కహనా హై.. అగర్​ పాకిస్తాన్​సే బాత్​ హోగీతో వో టెర్రరిజం పర్​ హోగీ,  పీఓకే పే హోగీ’ అని కఠోరంగా చెప్పడం చూస్తే.. కాల్పుల విరమణకు జోక్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ను పరోక్షంగా హెచ్చరించినట్లుగా ఉంది. 

అలాగే, కాల్పుల విరమణపై  ప్రజల విశ్వసనీయతను కాపాడే ప్రయత్నంగా ప్రధాని ప్రసంగం సాగింది. జాతి మనోభావాలను కాపాడే ప్రయత్నం మంచి పరిణామమే. దాన్ని నిలుపుకొని ఫలితాలు సాధించినపుడే ప్రధాని మోదీ ప్రసంగానికి సార్థకత.  అయితే, మోదీ ప్రసంగం జరుగుతుండగానే పాకిస్తాన్​​ మళ్లీ కాల్పులకు తెగబడటం గమనార్హం.

ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి నిన్న ప్రసంగించాల్సిన పరిస్థితుల నేపథ్యం  తెలియంది కాదు. ఆ నేపథ్యం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మూడు రోజుల పాటు డ్రోన్లు, ఏయిర్​ స్ట్రైక్​లతో మారుమోగించి..  భారత్​ కొంత పైచేయి సాధించిన  దశలో ఒక్కసారిగా వచ్చిన  కాల్పుల విరమణ ప్రకటనను దేశ ప్రజలు కొన్ని క్షణాల పాటైనా నమ్మలేకపోయారు. హతాశులైనారు. ఇది చిన్న విషయమేమీకాదు. దశాబ్దాల తరబడి పాక్ ప్రేరిత తీవ్రవాదంతో పీడించబడుతున్న దేశం మనది. దానికో పరిష్కారం దొరికే అవకాశంగా ఆపరేషన్​ సిందూర్​ను ఈదేశంలోని ప్రజలంతా ఎదురు చూశారు.  

మరో మూడు రోజులు ఆపరేషన్​ కొనసాగించి ఉంటే.. పాకిస్తాన్​ కాళ్ల బేరానికి వచ్చే అవకాశం ఉందని యుద్ధనిపుణులు సైతం చెప్పారు కూడా. అలాంటి దశలో కాల్పుల విరమణ వినవలసి వస్తుందని ఈ దేశంలో ఎవరూ ఊహించిలేదు. కానీ, వినవలసివచ్చింది. అందుకు కారణాలేమిటనేది దేశానికి మరొక పీడనగా మారింది.  తీవ్రవాద పీడిత దేశంగానే భారత్​ కొనసాగాలా? లేదా మరో భారీ ఆపరేషన్​తో పరిష్కారం దొరకనుందా? అనే ప్రశ్నలకు ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వమే  చెప్పగలదు తప్ప, మరెవరూ చెప్పడం  సాధ్యంకాని పని.

శాసించిన ట్రంప్​ ట్వీట్లు

అమెరికా ప్రెసిడెంట్ ఎక్స్​లో 10 తేదీన చేసిన మొదటి ట్వీట్​లో యుద్ధ విరమణను ఇరు దేశాలతో మాట్లాడి ప్రకటించామన్నారు. కాల్పుల విరమణ జరగడం మంచిదే. కానీ అది ఏవిధంగా జరిగిందనేదే ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. మోదీ నాయకత్వం పట్ల ఉన్న విశ్వసనీయతకూ అదో ప్రశ్నగా మారింది. పాకిస్తాన్​ ఆర్థికంగా, సామాజికంగా బలహీన పడ్డ దేశం. అలాంటి దేశాన్ని అమెరికా కాల్పుల విరమణకు ఒప్పించడం సులభం మాత్రమే కాదు, అది కోరుకుంటున్నది కూడా కాల్పుల విరమణనే అనేది దాని దుర్భరస్థితి సైతం చెపుతుంది.  

కానీ ప్రపంచంలోనే 4వ ఆర్థికశక్తిగా ఎదిగిన భారత్​ను కూడా కాల్పుల విరమణపై అమెరికా ఒప్పించడమేమిటనేదే ప్రశ్న.  పైగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పహల్గాంలో మతాధారంగా హత్యలు జరిపిన తీవ్రవాదాన్ని వదిలేసి, భారత్​ను కాల్పుల విరమణకు ఎలా ఒప్పించగలిగిందనేదే కదా భారత ప్రజల్లో  ఉన్న ప్రధానమైన మానసిక ఆందోళన. 

మోదీకి పరీక్ష!

 ట్రంప్​ తన ఎక్స్​ ఖాతాలో  రెండోరోజు మరో ట్వీట్​ చేయడం మరింత ఆశ్చర్యం కలిగించింది. ‘భారత్​పాక్​ కాల్పుల విరమణకు అంగీకరించినందుకు అభినందనలు. మరే సమస్య ఉన్నా మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాను. కాశ్మీర్​ సమస్య పరిష్కారం కోసం నేను మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాను’ అని ట్రంప్​  అనడం, భారత్​ దౌత్యస్వేచ్ఛపై సవారీ చేసింది. వెంటనే భారత్​ ఇచ్చిన స్పష్టత ఏమిటంటే... ‘కాశ్మీర్​పై పాకిస్తాన్​తో చర్చలు ఉండవు. ఈ విషయంలో  పాకిస్తాన్​తోనే కాదు, మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని కూడా  భారత్​ ఎప్పుడూ అంగీకరించదు. ఒకవేళ పాకిస్తాన్​తో చర్చలు జరిపేది ఉంటే, అది తీవ్రవాదంపై, పీఓకేపై మాత్రమే అని నిన్న కూడా  మోదీ ప్రసంగంలో  చెప్పారు. 

కాల్పుల విరమణపై దేశ ప్రజల్లో ఏర్పడిన సందిగ్ధాలను దూరం చేసే ప్రయత్నం  మోదీ ప్రసంగంలో మనకు స్పష్టంగా కనిపించింది. అది మంచి పరిణామమే అయినా.. ఈ దేశానికి పాక్​ ప్రేరిత తీవ్రవాదాన్ని అంతమొందించడం ఎలా అనేదే ప్రజల్లో ఉన్న శేష ప్రశ్న. ప్రసంగాలతో పాక్​ ప్రేరిత తీవ్రవాదం అంతమయ్యేది మాత్రం కాదు. దానికి మరో బిగ్​ ఆపరేషన్​ తప్పకపోవచ్చు. ట్రంప్​ జోక్యం భారత్​కు​ ఎప్పుడైనా అనర్థమనాలో, ప్రమాదమనాలో తెలియదు.  ఆ విషయాన్ని కాల్పుల విరమణకు ముందే ప్రధాని మోదీ అభ్యంతరం ఎందుకు చెప్పలేదనేదే ఆయనకు ఇపుడు పరీక్ష! 

ట్రంప్​కు​ నోబెల్​ ప్రైజ్​ దురాశా?

ఉక్రెయిన్,​- రష్యా యుద్ధాన్ని విరమింపజేయడంలో పూర్తిగా విఫలమైన డోనాల్డ్​ ట్రంప్..​ భారత్,​-పాక్​ మధ్య కాల్పుల విరమణ చేయించడమే ఆశ్చర్యంగా ఉంది. ఓ దిశా దశా లేని పాక్​ను లొంగదీసుకోవడం ట్రంప్​కు పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, బలమైన భారత్​ వంటి దేశం ఆపరేషన్​ సిందూర్​తో  ఫలితాన్ని ఛేదిస్తున్న  సమయంలో కాల్పుల విరమణ చేయించడమే ఇవాళ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం.  ప్రపంచం ముందు ఒక శాంతిదూతగా వెలుగొందాలనే ట్రంప్​ ఆరాటమే అందుకు కారణమా అంటే.. నిజమే అనే పొలిటికల్​ ఎక్స్​పర్ట్స్​​ సైతం ఉన్నారు. ట్రంప్​ దురాశకు ఇవాళ భారత్ ప్రయోజనాలు బలిగా ఎట్టిపరిస్థితుల్లోనూ మారకూడదు. అలాంటి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి మోదీపైనే ఉంది.  

మోదీకి అనేక ప్రశ్నలు 

కారణాలు తెలియని కాల్పుల విరమణపై అనేక ప్రశ్నలు మోదీ పాలనపై రాకపోతే ఆశ్చర్యపడాలి తప్ప, వస్తే ఆశ్చర్యపడేదేమీలేదు. మన కన్నా ముందే కాల్పుల విరమణను ట్రంప్​ ఎలా ప్రకటిస్తాడు? ఇది ప్రతి భారతీయుణ్ని తొలుస్తున్న ప్రశ్న.  ఒకవేళ ట్రంప్​ భారత్​తో కాల్పుల విరమణపై మాట్లాడి ఉంటే .. దాన్ని  స్వయంగా భారత్​ చెప్పాలి తప్ప ట్రంప్​ తనకు తానే ఎలా ప్రకటిస్తాడు? అలాగే, కాశ్మీర్​ సమస్యను కూడా నెగోషియేట్​ చేస్తాను అని  తనకు తానే ఎలా చెప్పాడు అనే ప్రశ్నలు సాధారమైణవేమీ కావు.  

అన్నీ తానే అనే ట్రంప్ తెంపరి​ ధోరణి ప్రపంచానికి తెలియంది కాదు.  ‘మోదీ మై బెస్ట్​ ఫ్రెండ్’​ అని ట్రంప్​ చాలాసార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కానీ, అలాంటి అతి విశ్వాసమే ఇవాళ మనకొక  సమస్యగా మారిందా? ఇవాళ మోదీ నాయకత్వానికి అవి ప్రశ్నలుగా మారాయి. అందుకోసమే మోదీ దేశ ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి తప్పలేదు.  కానీ కాల్పుల విరమణపై దేశానికి ఉన్న సందిగ్ధాలకు జవాబు చెప్పాలంటే.. తీవ్రవాద రహిత  ఫలితాలను సాధించి చూపడమే.. మోదీ తక్షణం చేయాల్సింది.  మొత్తం మీద మోదీ అధిగమించాల్సింది ట్రంప్​ జోక్యాన్నే! 

పాక్​ను కాపాడిన ట్రంప్​!

అక్కరలేని ట్రంప్​ జోక్యమే.. కాళ్లబేరానికి రావలసిన పాకిస్తాన్​ను కాపాడింది. ఆర్థిక దుస్థితి, అనిశ్చిత రాజకీయాలతో  సతమతమవుతున్న పరిస్థితుల నుంచి పాకిస్తాన్​ను  ట్రంప్​ జోక్యం  కాపాడింది. పాకిస్తాన్​ తన ఆర్థిక పరిస్థితి బాగలేని సమయంలో  కాల్పుల విరమణను ఎలాగూ కోరుకుంటుంది. కానీ, బలమైన సైనిక శక్తితో, ఆర్థిక శక్తితో నిలబడ్డ భారత్​ను సైతం కాల్పుల విరమణలోకి లాగింది ట్రంప్​ తెంపరితనమే!  మరోదేశం తనకు సాటిగా ఎదగొద్దనే దురుద్దేశమే అందుకు ఒక కారణం కావచ్చని కొందరు విదేశీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా. 

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి
పొలిటికల్​ ఎనలిస్ట్​