
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నది. ఈ ఒప్పందం, దాని తరువాతి పరిస్థితిపై చర్చించేందుకు రెండు దేశాలూ సోమవారం సమావేశమయ్యాయి. భారత్, పాకిస్తాన్‌లకు చెందిన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ)లు హాట్‌లైన్ (ప్రత్యేక టెలిఫోన్) ద్వారా మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగులో రెండు పక్షాలు మే 10న కుదిరిన ఒప్పందంలోని వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సమావేశం మొదట మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ చేసినప్పటికీ..సాయంత్రం 5 గంటలకు చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల ఫలితాలు ఇంకా వెలువడలేదు. డీజీఎంఓలే సైనిక ప్రణాళిక, సరిహద్దు కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు.