పిచ్చిపిచ్చిగా మాట్లాడ్తే బాగుండదు.. మాకు గౌరవమిస్తేనే బీఆర్ఎస్​తో పొత్తు: కూనంనేని 

పిచ్చిపిచ్చిగా మాట్లాడ్తే బాగుండదు.. మాకు గౌరవమిస్తేనే బీఆర్ఎస్​తో పొత్తు: కూనంనేని 
  •     ఐక్యంగానే లెఫ్ట్ పార్టీలు: తమ్మినేని  
  •     9న సీపీఎం, సీపీఐ ఉమ్మడి సభ 

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో 40 నుంచి 50 స్థానాల్లో గెలిపించే లేదా ఓడించే శక్తి లెఫ్ట్ పార్టీలకు ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీట్ల కోసం కక్కుర్తి పడేవారెవ్వరూ తమ పార్టీల్లో లేరన్నారు. బీఆర్ఎస్ నేతలు పిచ్చిపిచ్చిగా, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. పోటీ చేస్తామని చెప్పుకోవచ్చని, కానీ కమ్యూనిస్టుల తరఫున కూడా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులకు ఓట్లే పడవని అనేటోళ్లు.. తమ వద్దకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.

మంగళవారం సీపీఐ స్టేట్ ఆఫీస్ లో ఆ పార్టీ నేతలు కూనంనేని, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ, తదితరులతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ నేతలు చెరుపల్లి సీతారాములు, జాన్ వెస్లీ, తదితరులు సమావేశమయ్యారు. రెండు పార్టీల ఐక్యత చాటేలా ఈ నెల 9న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో సీపీఐ, సీపీఎం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల సభను నిర్వహిస్తున్నామని ఆయా పార్టీల నేతలు చెప్పారు. ఈ సభలో సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా పాల్గొంటారని వెల్లడించారు.

రాబోయే ఎన్నికల్లో అవకాశం ఉంటే బీఆర్ఎస్ తో సీట్ల సర్దుబాటు, పొత్తు కుదర్చుకుంటామని, లేకపోతే తమ దారిలో తాము పోటీ చేస్తామని తమ్మినేని స్పష్టంచేశారు. అదానీ విషయంపై, ప్రధాని మోడీ, కేంద్ర విధానాలపై విమర్శించేందుకు వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిలకు మాటలు రాలేదని, ఇప్పటికైనా ఆమె తన తప్పిదాలను తెలుసుకోవాలన్నారు.