సాయి చరణ్, ఉషశ్రీ జంటగా మణికంఠ దర్శకత్వంలో క్రాంతి ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘ఇట్స్ ఓకే గురు’. డిసెంబర్ 19న సినిమా విడుదల కానుంది. శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూస్తుంటే మంచి సబ్జెక్టుతో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇటీవల చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇందులో ఒక సాంగ్ నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ మణికంఠ సహా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.
ఈ సినిమా తన పర్సనల్ లైఫ్‌కు బాగా కనెక్ట్ అయిందని హీరో సాయి చరణ్ అన్నాడు. ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని ఉషశ్రీ చెప్పింది. డైరెక్టర్ మణికంఠ మాట్లాడుతూ ‘ఇట్స్ ఓకే గురు అనేది ఒక మంత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా ఇట్స్ ఓకే అని ముందుకెళ్ళిపోతే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది.
అదే ఈ సినిమాలో ఉంది. మన మనసుతో మనం వైవా చేసుకుంటే ఎలా ఉంటుందో అదే మా సినిమా’ అని అన్నాడు. నిర్మాత క్రాంతి ప్రసాద్ మాట్లాడుతూ ‘మన డైలీ రొటీన్‌లో చిన్న విషయాలకు కూడా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటాము. ఈ సినిమాలో అలాంటి ఎమోషన్స్‌ని ఎలా అధిగమించాలి అనేది చూపించబోతున్నాం’ అని చెప్పారు.
