వరంగల్ జిల్లాలో.. పెండ్లి అయి ఏండ్లు గడుస్తున్నా.. పిల్లలు లేని దంపతులకు గుడ్ న్యూస్

వరంగల్ జిల్లాలో.. పెండ్లి అయి ఏండ్లు గడుస్తున్నా.. పిల్లలు లేని దంపతులకు గుడ్ న్యూస్
  • ఇదే అదునుగా ప్రైవేటులో రూ.లక్షల్లో దోపిడీ
  • పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రభుత్వాస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్ ప్రారంభం
  • ఆరు నెలల కిందట వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం 
  • సత్ఫలితాలు వస్తుండటంతో పెరుగుతున్న క్యూ

హనుమకొండ, వెలుగు: పెండ్లి అయి ఏండ్లు గడుస్తున్నా సంతానం కలగక ఎంతో మంది ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అమ్మా.. అనే పిలుపు కోసం ఆరాట పడుతూ ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్లు వారిని నిండా ముంచుతున్నాయి. ప్యాకేజీలు మాట్లాడుకుని రూ.లక్షల్లో దోచుకుంటున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది.

ఇలా సంతానం కోసం రూ.లక్షలు వెచ్చించే స్థోమతలేని దంపతుల కోసం రాష్ట్ర ప్రభుత్వమే జిల్లా కేంద్రాల్లోని సర్కారు హాస్పిటళ్లలో సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే వరంగల్ చందా కాంతయ్య మెమోరియల్(సీకేఎం) ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ సత్ఫలితాలు వస్తుండటంతో సీకేఎం ఐవీఎఫ్ సెంటర్ కు తాకిడి పెరుగుతోంది.

ప్రైవేటులో రూ.లక్షల్లో దోపిడీ..

ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చాలామందిలో ఫర్టిలిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ఐవీఎఫ్ సెంటర్లు పెరుగుతున్నాయి. వరంగల్ నగరంలో గతంలో ఒకట్రెండు మాత్రమే ఉండే ఐవీఎఫ్ సెంటర్లు ఇప్పుడు 12కుపైగా పెరిగిగాయి. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల లోపాలు, వారి అమాయకత్వాన్ని అదునుగా చేసుకుని ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్లు దందా సాగిస్తున్నాయి. 

కొన్నిరోజుల కిందట హైదరాబాద్ లో వెలుగు చూసిన 'సృష్టి' ఫర్టిలిటీ సెంటర్ బాగోతాలు కలకలం రేపగా, చాలాచోట్లా ఐవీఎఫ్ సెంటర్లు తోచిన విధంగా దగాకు పాల్పడుతున్నాయి. సంతానలేమితో బాధపడే దంపతులతో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీలు మాట్లాడుకుని దందా సాగిస్తున్నాయి. రూ.లక్షలు ఖర్చు పెట్టినా సంతానం కలగకపోతే డాక్టర్ల సూచనలు సరిగా పాటించకపోవడం వల్లే ప్రెగ్నెన్సీ రాలేదని సాకులు చెబుతూ తప్పించుకుంటున్నాయి.

పైసా ఖర్చు లేకుండా సీకేఎంలోనే ట్రీట్మెంట్.. 

2017లో అప్పటి ప్రభుత్వం వరంగల్ ఎంజీఎంలో ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేసింది. కానీ, ఇక్కడి లీడర్లు పట్టించుకోక కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే సంతానలేమితో బాధపడేవారికి పైసా ఖర్చు లేకుండానే ట్రీట్మెంట్ అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ క్లినిక్​లను ఏర్పాటు చేసింది. 

ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 15న వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో సంతాన సాఫల్య చికిత్స కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందులో ఫర్టిలిటి స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, ఎంబ్రియోలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, అనస్థీషియాలజిస్ట్ తదితర సిబ్బందిని నియమించి సేవలందిస్తోంది. ఉమ్మడి వరంగల్ తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి బాధితులు ఇక్కడికి వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

నెలకు సగటున వంద మంది..

ఈ ఏడాది మార్చి 15న ఐవీఎఫ్ సేవలు ప్రారంభించగా ఇక్కడున్న సిబ్బంది బాధితులకు ముందుగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అనంతరం వారికి అనుగుణంగా ట్రీట్మెంట్ అందించి, ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో ఇక్కడికి వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మార్చిలో 29 మంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం రాగా, ఏప్రిల్ లో 117, మేలో 118, జూన్ లో 106, జులైలో 108 మంది చికిత్స కోసం వచ్చారు. ఆగస్టులో 62, సెప్టెంబర్ లో 58, ఈ నెలలో ఇప్పటివరకు ఏడుగురు ట్రీట్మెంట్ కోసం రాగా, వరుస పండుగల నేపథ్యంలో గడిచిన మూడు నెలల నుంచి రష్ తగ్గినట్టు డాక్టర్లు చెబుతున్నారు. 

సగటున ప్రతి నెల వంద మంది వరకు ఐవీఎఫ్ సేవలు వినియోగించుకుంటుండగా, అందులో సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉంటోందని పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే ఐవీఎఫ్ క్లినిక్ లో ప్రస్తుతం ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇక్కడికి వస్తున్న బాధితులు చెబుతున్నారు. మరింతమంది స్టాఫ్ ను కేటాయించి, తగిన వసతులు కల్పించాలని కోరుతున్నారు.