మా గెలుపును డాక్టర్లు, జవాన్లు, పోలీసులకు అంకితమిస్తాం

మా గెలుపును డాక్టర్లు, జవాన్లు, పోలీసులకు అంకితమిస్తాం

ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్ ఫైనల్‌లో గెలిచి కప్‌ను భారత్‌కు తీసుకురావాలని ప్లేయర్లు శ్రమిస్తున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ముంబైలో క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు బుధవారం యూకే ఫ్లయిట్ ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ గురించి సీనియర్ పేసర్ మహ్మద్ షమి పలు విషయాలను పంచుకున్నాడు. కప్ గెలిస్తే ఆ విజయాన్ని కరోనాపై పోరులో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్, డాక్టర్లతోపాటు పోలీసులు, జవాన్లకు అంకితం ఇస్తామని షమి అన్నాడు. 

‘దేశం తరఫున ఆడేటప్పుడు ఫలితం ఏమైనా సరే మేం వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడతాం. గత కొన్నేళ్లుగా మేం ఓ జట్టుగా కలసి శ్రమిస్తున్నాం. ఇదే ఆటతీరును కొనసాగించి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలుస్తామని ఆశిస్తున్నా. భారత్, న్యూజిలాండ్ రెండు జట్లకూ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీ గడ్డపై ఆడటం వల్ల ఏ జట్టుకూ అదనపు ప్రయోజనం లభించదు. మా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరూ పెద్ద తప్పులు చేయకుండా మంచిగా రాణిస్తారని భావిస్తున్నా. రెండు టాప్ క్లాస్ టీమ్స్ తలపడుతున్నాయి కాబట్టి టైమ్‌‌, స్కిల్స్‌‌ను బాగా వాడుకోవడం ముఖ్య పాత్ర పోషిస్తుంది’ అని షమి పేర్కొన్నాడు.