కేసీఆర్ ఉద్యమకారులను అణిచివేసిండు

కేసీఆర్ ఉద్యమకారులను అణిచివేసిండు
  • పదేండ్లు రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడిచింది : గజ్జెల కాంతం 

బషీర్ బాగ్, వెలుగు : తెలంగాణ ఉద్యమకారులను మాజీ సీఎం కేసీఆర్ అణిచివేశారని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ లక్డీకపూల్ లోని సెంట్రల్ కోర్టు హోటల్ లో 'తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం' రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జెల కాంతం మాట్లాడుతూ...

రాష్ట్రంలో గత 10 ఏండ్లు దుర్మార్గపు పాలన నడిచిందని తెలిపారు. తెలంగాణ ద్రోహులకు రాజకీయ పదవులు కట్టబెట్టిన రోజే కేసీఆర్ ఉద్యమ ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. ఉద్యమ సమయంలో విద్యార్థులు, యువతను హరీశ్ రావు రెచ్చగొట్టి వారి ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. 

ఉద్యమకారులకు దక్కిన తొలి గుర్తింపు

ఓయూ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, అమరవీరుల కుటుంబానికి రూ.25 వేల పెన్షన్ ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ఈ నిర్ణయం తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన తొలి గుర్తింపుగా భావిస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకుండా ఉద్యమకారులు కొట్లాడాలని సూచించారు. ఓడిపోయే టికెట్ తనకు కట్టబెట్టి, తన ప్రత్యర్థి గెలవడానికి కేటీఆర్ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమకారుడు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ..కేసీఆర్ తో ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని, ఆయన తెలంగాణ సమాజ ద్రోహి అని విమర్శించారు. కాంగ్రెస్   గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు టికెట్ కేటాయించలేదని, ఆ తప్పిదం పార్లమెంట్ ఎన్నికల్లో చేయవద్దని కోరారు.  పలు జిల్లాల ఉద్యమకారులు పాల్గొన్నారు.