- కొడుకు, బిడ్డకోసం కేసీఆర్ ఇష్టారీతిన విభజించిండు: బండి సంజయ్
- పాలకులు మారినప్పుడు పథకాల పేర్లు మారుతాయని కామెంట్
కరీంనగర్, వెలుగు: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విషయంలో కేసీఆర్ ఇష్టానుసారం వ్యవహరించారని, కుటుంబ ఆస్తులను పంచినట్టు కొడుకు, కూతురు, అల్లుడి కోసం జిల్లాలను ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే మాదిరి చేస్తే ఇబ్బందులు తప్పవని, వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ లోని ఓ హోటల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘అన్ని పార్టీల నేతలు బీజేపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నరు. అయినా, టికెట్ల కేటాయింపులో కాషాయ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఉంటది.
అవినీతి, భూకబ్జా ఆరోపణలు, రౌడీషీట్లు లేనోళ్లనే బీజేపీలో చేర్చుకుంటం. కరీంనగర్ సిటీకి అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్లు విడుదలయ్యాయి. అందులో కేంద్రం వాటా రూ.40 కోట్లు, రాష్ట్రం వాటా రూ.10 కోట్లు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్ సహా వివిధ కేంద్ర పథకాల ద్వారానే కరీంనగర్ ను అభివృద్ధి చేశాం. ఇంకా చేయాల్సి ఉంది’’అని అన్నారు.
125 రోజుల పని దొరుకుతది
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ-జీ రామ్ జీ పథకం అద్భుతమని బండి సంజయ్ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరికి కచ్చితంగా 125 రోజుల పని దొరుకుతది. వ్యవసాయ సీజన్ లో కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం రిలీఫ్ ఇస్తది. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేయడంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నది.
పాలకులు మారినప్పుడు పథకాల పేర్లు మారడం సహజమే. గతంలో వాల్మికీ, అంబేద్కర్ పేర్లతో వాజ్ పేయి ప్రభుత్వం వాంబే ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడితే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి పేర్లను తొలగించి ఇందిరాగాంధీ ఆవాస్ యోజనగా మార్చింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా నామకరణం చేసింది.
వీబీ-జీ రామ్ జీ పథకంలో ఇక నేరుగా డబ్బులన్నీ కూలీల ఖాతాలోనే పడతాయి. నిర్ణీత టైంలో పని కల్పించకపోతే వడ్డీతో సహా ఉపాధి భత్యం చెల్లించాల్సిందేనని వెల్లడించారు. నూతన ఉపాధి పథకం కావాలా? వద్దా? కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి’’అని సంజయ్ డిమాండ్ చేశారు.
