కాంగ్రెస్ గెలుపుపై సంబురాలు

కాంగ్రెస్ గెలుపుపై సంబురాలు

ఓయూ,వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద జేఏసీ నేతలు సంబరాలు చేశారు. ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ఆర్ట్స్​కాలేజీ వద్ద విద్యార్థి నేతలు, నిరుద్యోగులు పెద్దఎత్తున గుమిగూడి భారీ ఎత్తున పటాకులు కాల్చారు. బై బై కేసీఆర్ అంటూ నినదిస్తూ ప్రజల తీర్పు చారిత్రాత్మకమని కొనియాడారు.

పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ విజయం  అన్నివర్గాల ప్రజల కృషితోనే సాధ్యమైందన్నారు.  ప్రజాపాలన కాంగ్రెస్​తోనే సాధ్యమని  పేర్కొన్నారు. వర్సిటీలు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని, ఓయూకు సీఎంను తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. విద్యార్థినేతలు ఎలిమినేటి జంగారెడ్డి, రవి,  బైరు నాగరాజు,  తదితరులు పాల్గొన్నారు.


ఇది ప్రజా విజయం


పద్మారావునగర్:  కాంగ్రెస్​ మెజార్టీ స్థానాలు గెలవడం శుభపరిణామమని, ఇది ప్రజల విజయమని పీసీసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్​మర్రి ఆదిత్యారెడ్డి అన్నారు. రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలోని కొత్త కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ సనత్​ నగర్​ పరిధి బన్సీలాల్​ పేట డివిజన్​లో కాంగ్రెస్​శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. 


నిజాంపేటలో..

జీడిమెట్ల: కాంగ్రెస్​ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. నిజాంపేట ​సీనియర్ ​నేత కొలను శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద  పటాకులు కాల్చి, కేక్​కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు.