విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలి

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలి
  •      సీఎం రేవంత్​కు వినతిపత్రం ఇచ్చిన తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ 
     

ముషీరాబాద్,వెలుగు: విశ్వ బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి ఆధ్వర్యంలో విశ్వకర్మలు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం గణేశ్ చారి మాట్లాడుతూ.. రాష్ట్ర అటవీ శాఖ మినహాయించిన 44 రకాల కర్రలను విశ్వకర్మలు వ్యవసాయదారుల కోసం పనిచేస్తూ వాడుతున్నారన్నారు. 

అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టె కోత మెషీన్లను రద్దు చేసిందన్నారు. రైతులకు వ్యవసాయ పనిముట్ల కోసం, విశ్వకర్మలకు ఉపాధి కోసం తిరిగి వాటిని పునరుద్ధరించాలని కోరారు.  రాష్ట్రంలోని 20 లక్షల మంది విశ్వబ్రాహ్మణుల సమస్యలను  ముఖ్యమంత్రికి వివరించామన్నారు. 

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్​ను వెంటనే ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్ల బడ్జెట్​ను కేటాయించాలన్నారు. విశ్వబ్రాహ్మణులను ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లుగా నామినేట్ చేయాలన్నారు. పెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంత్ చారి విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసి జయంతి, వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. తమ వినతిపై సీఎం సానుకూలంగా స్పందించారని గణేశ్ చారి తెలిపారు.