
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ' పరదా' . ఈ మూవీ ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఒక సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ పాటను వనమాలి రచించారు. ప్రముఖ గాయకుడు అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ప్రాణం పోశారు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్ లో మహిళల పట్ల సమాజంలో నెలకొన్న ద్వంద్వ ప్రమాణాలు , వారు ఎదుర్కొంటున్న సవాళ్లు కళ్లకు కట్టినట్లు చూపించారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనుపమ మాట్లాడుతూ.. ఒక అమ్మాయి లీడ్ రోల్ గా వస్తున్న సినిమా పోస్టర్ చూస్తే చాలు అందరూ వెనక్కి వెళ్లిపోతారు. అది నిర్మాత , డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీ, ఆడియన్స్ ఇలా ఎవరైనా కాచ్చు. అది తప్పు అని నేను చెప్పడం లేదు.. కానీ అదే రియాలిటీ అని చెప్పుకొచ్చారు. యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' - ఆడవారిని ఎక్కడ పూజిస్తారో, అక్కడ దేవతలు సంచరిస్తారు అని ఋగ్వేదం స్త్రీని విశ్వశక్తిగా కీర్తించింది. అయితే, కాలక్రమేణా స్త్రీలు ఎదుర్కొన్న కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు 'పరదా' సినిమా వస్తోంది.
ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సంగీత , దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'సినిమా బండి' వంటి విభిన్న చిత్రాన్ని రూపొందించిన ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, మరియు శ్రీధర్ మక్కువ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.