భూనిర్వాసితుల త్యాగాలతోనే ఉద్దండాపూర్ రిజర్వాయర్ : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

భూనిర్వాసితుల త్యాగాలతోనే ఉద్దండాపూర్ రిజర్వాయర్ : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఉద్దండాపూర్ రిజర్వాయర్ గుండెకాయ వంటిదని, ఇది పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వల్లూరు సమీపంలో భూ నిర్వాసితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తను రాజకీయాలు చేయడానికో, వేరే పార్టీలను విమర్శించడానికో రాలేదని, తమ భూములను త్యాగం చేసి నిర్వాసితులతో కలిసి భోజనం చేయడం అదృష్టంగా భావించివచ్చినట్లు తెలిపారు. వారసత్వ ఆస్తులతో పాటు పుట్టి పెరిగిన గ్రామాలు కళ్లముందే మునిగిపోతుంటే, ఆ బాధ చెప్పలేనిదని, బాధితుల బాధను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. 

సర్వేలో ఆలస్యం జరిగినది వాస్తవమేనని, కలెక్టర్ విజయేంద్ర బోయి నిర్వాసితులకు త్వరగా న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.  భూ నిర్వాసితుల్లో ఇంకా ఎవరికైనా సమస్యలుంటే నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగానే డిసెంబర్ 9లోపు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలను పూర్తి చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. భూ నిర్వాసితులకు అప్పటి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదని, పెంచాల్సిందిగా సీఎంకు విన్నవించానని గుర్తుచేశారు. ఆ అంశం న్యాయ పరిధిలో ఉందని, మరో వారం పది రోజుల్లో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గంలోని లింగంపేట్ అల్లుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరులు మల్లు అనంత రాములు ఎంపీగా, మల్లు రవి జడ్చర్ల ఎమ్మెల్యేగా గతంలో చేసిన పనులను ఆయన గుర్తు చేశారు. నిర్వాసితులందరికీ అవార్డులు పాసయ్యేలా చూస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి  తనకు ఫోన్ చేసి  భూ నిర్వాసితులకు భోజనం పెట్టాలని,  సమస్యలు తెలుసుకుని అండగా నిలబడాలని సూచించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు.