ధోని సలహా నా బ్యాటింగ్‌‌ను మార్చేసింది

ధోని సలహా నా బ్యాటింగ్‌‌ను మార్చేసింది

ప్రస్తుత వరల్డ్ క్రికెట్‌‌లో బెస్ట్ ఆల్‌‌రౌండర్‌‌లలో ఒకడిగా టీమిండియా తరుపు ముక్క రవీంద్ర జడేజా పేరు తెచ్చుకున్నాడు. నియంత్రణతో కూడిన స్పిన్ బౌలింగ్‌‌కు తోడుగా బ్యాటింగ్‌లో పించ్ హిట్టింగ్ సామర్థ్యం, అద్భుతమైన ఫీల్డింగ్‌‌తో జడ్డూ టాప్ క్లాస్ ప్లేయర్‌‌గా ఎదుగుతున్నాడు. కొన్ని సంవత్సరాలుగా నిలకడైన ఆటతీరుతో భారత జట్టులో కీలకమైన ఆటగాడిగా ఎదిగిన ఈ లెఫ్టాంటెడ్ ప్లేయర్.. కెరీర్ కొన్నేళ్ల కిందట తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో అతడి షాట్ సెలక్షన్‌పై చాలా మంది పెదవి విరిచారు. ఈ అంశం మీద రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో జడ్డూ నోరు విప్పాడు. బ్యాటింగ్ విషయంలో సమస్యలను అధిగమించడానికి ధోని ఇచ్చిన సలహా తనకు బాగా పనికొచ్చిందన్నాడు. 

‘2015 ప్రపంచకప్ సమయంలో నేను ఆడకూడని బంతులకు కూడా షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నానని ధోని చెప్పాడు. షాట్ సెలక్షన్ విషయంలో తప్పులు చేస్తున్నానని నాకు అర్థమైంది. నేను బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఎదుర్కొన్న పలు బాల్స్ వరకు నా జడ్జిమెంట్ సరిగ్గా ఉండేది కాదు. హిట్టింగ్‌కు వెళ్లాలా లేదా అని డబుల్ మైండ్‌లో ఉండేవాడ్ని. కానీ ఇప్పుడు నేను క్లియర్ మైండ్‌‌సెట్‌తో ఉన్నా. కొంత సమయం తీసుకొని క్రీజులో సెటిల్ అయ్యాకే ఏం చేయాలో డిసైడ్ అవుతున్నా. రన్స్‌‌ను త్వరగా కవర్ చేయగలనని నాకు తెలుసు. ఈ దృక్పథమే నా ఆలోచనా తీరును మార్చేసింది. బౌన్సర్లను బౌండరీలకు తరలించినప్పుడు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది’ అని జడ్డూ పేర్కొన్నాడు.