అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి

అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి
  • అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి
  • ఉద్యమకారులు, ప్రజలకు దూరంగా ఉంటుండనే విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం
  • బూత్ లెవల్ లీడర్లతో వారం రోజుల పాటు మీటింగ్ లు
  • మండలాల వారీగా విస్తృత పర్యటనలు

సూర్యాపేట, వెలుగు : పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని పట్టించుకోవడం లేదని.. ఉద్యమకారులు, ప్రజలను దూరం పెడుతున్నారన్న విమర్శలు వస్తుండడంతో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌రెడ్డి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతుండడంతో తనపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టడంతో పాటు, లీడర్ల మధ్య ఉన్న విభేదాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ బూత్‌‌ లెవల్‌‌ క్యాడర్‌‌తో మీటింగ్‌‌లు పెడుతున్నారు. దీంతో పాటు ఎన్నికల్లో ప్రభావం చూపే ఇతర పార్టీల లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్‌‌ చేస్తున్నారు.

ప్రతి గ్రామంలో గ్రూప్‌‌ లొల్లులే...
సూర్యాపేట నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీలో పనిచేస్తూ, పదవులు ఆశించిన నాయకులకు చివరకు నిరాశే మిగిలింది. పాత వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు అప్పగించడంతో లీడర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. చివరకు మండల అధ్యక్ష పదవులను సైతం కొత్త వారికే కేటాయించడంతో వ్యతిరేకత తీవ్రమైంది. చివ్వెంల ఎం‌‌పీపీ, వైస్‌‌ ఎంపీపీ రెండు వర్గాలుగా ఏర్పడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో ప్రొటోకాల్‌‌ రగడ, ఇతర పార్టీల నుంచి వచ్చిన లీడర్ల పెత్తనం, గ్రామాల్లో చేపట్టిన పనుల్లో భేదాభిప్రాయాలు రావడంతో గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒక్కో గ్రామంలో నాలుగు నుంచి ఐదు గ్రూపులు ఏర్పడి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రూప్‌‌ తగాదాలు పెరగడం, టీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ఇతర పార్టీల్లో చేరేందుకు ప్లాన్‌‌ చేస్తుండడంతో ఇటీవల జిల్లా కేంద్రంలో మీటింగ్‌‌ నిర్వహించారు. అయినా లీడర్ల మధ్య గ్యాప్‌‌ తగ్గించడంలో ఫెయిల్‌‌ అయ్యారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. అలాగే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని, పైరవీకారులు చెప్పిన వాటికి మాత్రం వెంటనే ఓకే చెబుతున్నారని కొందరు లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు (ఎస్‌‌) మండలంలో ఎంపీపీ, జడ్పీ వైస్‌‌ చైర్మన్‌‌ మధ్య వర్గపోరు నడుస్తుండగా ఇక్కడ బీసీ, రెడ్డి వర్గాలుగా వీడిపోయారు. 

ఉద్యమకారులను బుజ్జగించే ప్రయత్నం
ఉద్యమకారులతో మొదట్లో సన్నిహితంగానే ఉన్న మంత్రి జగదీశ్‌‌రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చాక వారిని దూరం పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, కొత్తగా వచ్చిన వారికే కీలక పదవులు కట్టబెడుతున్నారని ఉద్యమకారులు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న పార్టీ క్యాడర్‌‌ను తన వైపు తిప్పుకోవడంతో పాటు, నాయకుల మధ్య విభేదాలు, గొడవల అంశాలపై ఆరా తీస్తూ వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బూత్‌‌ లెవెల్‌‌ స్థాయి నుంచి మీటింగ్‌‌లు పెడుతున్నారు. నియోజకవర్గంలోని వివిధ అనుబంధ సంఘాల నేత‌‌లు, కార్యకర్తలు, పార్టీలో మొదటి నుంచి ఉన్న క్యాడర్‌‌ అభిప్రాయాలు తెలుసుకునేందుకు మండలాల వారీగా విస్తృత స‌‌మావేశాలు నిర్వహిస్తున్నారు. 

బూత్ లెవెల్ లీడర్లతో వారం రోజుల పాటు మీటింగ్ లు
లీడర్లందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు రోజుకో మండలం చొప్పున నాలుగు మండలాల బూత్‌‌ లెవెల్‌‌ లీడర్ల నుంచి గెలిచిన, ఓడిన వార్డు సభ్యులు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎం‌‌పీటీసీలు, ఎం‌‌పీపీలతో మీటింగ్‌‌లు పెడుతున్నారు. ఆయా మండలాల లీడర్ల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన పెన్‌‌పహాడ్‌‌ మండల సమావేశంలో ఇతర పార్టీలోని నాయకులను తమ పార్టీలోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రతి గ్రామానికి వచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మీటింగ్‌‌లో వ్యూహకల్పన చేసినట్లు ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. అంతేకాకుండా సూర్యాపేట మున్సిపాలిటీ లీడర్లలో సైతం అసంతృప్తి ఉన్న నేపథ్యంలో రెండు రోజుల పాటు 48 వార్డుల లీడర్లతో సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.