కృష్ణాలో నీళ్లున్నా పంటలు ఎండబెడుతున్నారు :  మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

కృష్ణాలో నీళ్లున్నా పంటలు ఎండబెడుతున్నారు :  మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

నల్గొండ, వెలుగు : కృష్ణా నదిలో నీళ్లు ఉన్నప్పటికీ, చేతులారా రైతుల పంటలను ఎండబెడుతూ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ముమ్మాటికీ నేరపూరిత చర్యలేనని ఆరోపించారు. శనివారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం పొలాల సమీపంలోని విద్యుత్ సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌ను వెళ్లి కరెంట్ సరఫరా వివరాల లాగ్‌‌‌‌బుక్‌‌‌‌ను పరిశీలించి మాట్లాడారు.  నీళ్లు లేవని ఒకరు, బొగ్గు లేదని మరొకరు చెబుతూ కరెంట్, సాగునీటిని బంద్ పెట్టి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు.

ఎల్​నినో ఎంత అబద్ధమో.. బొగ్గు కొరత అనేది కూడా అంతే పెద్ద అబద్ధమని తెలిపారు. కేసీఆర్ హయాంలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసి, పదేండ్ల పాటు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఎందుకు బంద్ పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. నీళ్లు వాడుకున్నామని అసత్యాలు ప్రచారం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు పంటలు ఎండుతుంటే రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పంటలను కాపాడుకోవడానికి తక్షణమే సాగునీరు, నిరంతర విద్యుత్ అందించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం పెద్ద ఎత్తున క్షేత్రస్థాయి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.