పెన్షన్ల పెంపుపై సీఎం జగన్ తొలి సంతకం

పెన్షన్ల పెంపుపై సీఎం జగన్ తొలి సంతకం

ఏపీ సీఎంగా ప్రమాణం చేశారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.ముందుగా పెన్షన్ పై తొలి సంతకం చేశారు జగన్.  ఈ రోజు అవ్వ, తాతల కోసం ఈ కార్యక్రమంలోఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపిన ముఖ్యమంత్రి…తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్‌ను రూ.3వేలకు పెంచుతున్నానని తెలిపారు. నా మొదటి సంతకం ఈ ఫైల్‌ మీదే పెడుతున్నానన్నారు.  ప్రతి ఏడాది ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం దీనిని 2 వేల500 రూపాయలు చేయనున్నట్లు, ఆ తదుపరి సంవత్సరం 2 వేల750 రూపాయలు, అనంతరం 3 వేల రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు.

మేనిఫెస్టోను ఒక ఖురాన్‌లా, బైబిలా, ప్రతి అంశం ఒక భగవద్గీతలా భావిస్తా అన్నారు. అదే నా ఊపిరిగా ఈ ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని ముఖ్యమంత్రి హోదాలో మాటిస్తున్నానన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నానన్న ఆయన.. 3 వేల 648కి.మీ ఈ నేల మీద
నడిచినందుకు.. గత 9 సంవత్సరాలుగా ఒకడిగా మీలో నిలిచినందుకు.. ఆకాశమంతటి విజయం అందించిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, భవిష్యత్‌లో తమిళనాడుకు కాబోయే సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం జగన్.