అవినీతి లేని పాలనతో 6 నెలల్లో మార్పు చూపిస్తా : జగన్

అవినీతి లేని పాలనతో 6 నెలల్లో మార్పు చూపిస్తా : జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ఓవర్ డ్రాఫ్ట్ మీద బతకాల్సిన పరిస్థితి ఉందని మోడీకి తెలిపానన్నారు. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయేనాటికి గడిచిన 65 ఏళ్లలో ఏపీపై రూ.97వేల కోట్ల అప్పులుంటే.. ఈ ఐదేళ్లలోనే దనిని చంద్రబాబు ప్రభుత్వం రూ.2లక్షల 58వేల కోట్లకు పెంచిందని అన్నారు జగన్. ఏపీ చాలా ఇబ్బందుల్లో ఉందని.. కేంద్రం సాయం అవసరమని మోడీకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు జగన్.

చంద్రబాబు హయాంలో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపించారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందిస్తామన్నారు. పాలనను ప్రక్షాళన చేసి… దేశానికే రోల్ మోడల్ గా ఏపీని తీర్చిదిద్దుతానన్నారు. పారదర్శకత అంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు దేశంలోనే గుర్తింపు వచ్చేలా చేయబోతున్నామన్నారు. తమకో ప్రణాళిక ఉందని.. దానిని మే 30న తాను ప్రమాణ స్వీకారం చేయబోయే రోజునుంచే మొదలుపెట్టబోతున్నామన్నారు.