MLAలను లాగితే అసెంబ్లీ బతకదు : సీఎం జగన్

MLAలను లాగితే అసెంబ్లీ బతకదు : సీఎం జగన్

విలువలకు కేరాఫ్ గా ఉండే అసెంబ్లీని తమ ప్రభుత్వం నడిపిస్తుందని… దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తర్వాత జగన్ మాట్లాడారు. గత అసెంబ్లీలో వైసీపీకి చేదు అనుభవాలు ఎదురయ్యాయంటూ వాటిని వివరించారు. గత అసెంబ్లీలో విలువల్లేని రాజకీయాలు చూశామనీ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయకుండా చట్టాలను తూట్లుపొడుస్తూ దిగజారిన వ్యవస్థను కూడా చూశామన్నారు. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని దిగజారిన వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో చూశామన్నారు. తాను కూడా అలాగే చేస్తే.. అటువంటి అన్యాయమైన సంప్రదాయాన్ని పాటిస్తే మంచి అనేది బతకదు… రాష్ట్రం కూడా బాగుపడదు అన్నారు

అసెంబ్లీ సంప్రదాయాలను.. పార్లమెంట్ విలువలను రాజ్యాంగ స్ఫూర్తి తెలిసిన వ్యక్తి.. అటువంటి వ్యక్తి న్యాయం చేస్తాడు అని నమ్మి.. అటువంటి అన్ని గుణాలు ఉన్నాయని నమ్మిన తర్వాతే తమ్మినేని సీతాారాంను స్పీకర్ గా ఎన్నుకున్నామని చెప్పారు జగన్. స్పీకర్ సీతారాం అధ్యక్షతన ప్రజాస్వామ్యం, చట్టసభల మీద గౌరవం పెంచుతామని చెప్పారు.

“67 మంది అసెంబ్లీలో వైసీపీ గుర్తుపై గెలిస్తే.. 23 మంది ఎమ్మెల్యేలను.. పార్టీ మార్చి… కండువాలు కప్పి.. అందులో నలుగురిని మంత్రులుగా చేసి.. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ను తుంగలో తొక్కి… ప్రజాస్వామ్య దేవాలయ ప్రతిష్టను ఎలా దెబ్బతీశారో ఇదే అసెంబ్లీలో అంతా చూశాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ట్రెజరీ బెంచ్ ల్లో.. ఇటువైపు అధికార బెంచ్ ల్లో కూర్చోబెట్టుకుని.. మంత్రులుగా చేశారు. చివరకు స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాలనుకున్న నిబంధనను.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్పటికప్పుడు మార్చేయడాన్ని కూడా ఈ అసెంబ్లీలో చూశాను. పార్టీ ఫిరాయించిన వాళ్లను డిస్ క్వాలిఫై చేయండని.. వారిపై అనర్హత వేటు వేయాలని.. అలా వేస్తేనే ఈ సభ మర్యాద కాపాడబడుతుందని అప్పుడే ఈ సభకు మేం వస్తాం అని అడిగినా కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితుల్లేని సభను చూశాం. ఇప్పుడు ఆపరిస్థితి మారుతుంది” అన్నారు జగన్.

“అసెంబ్లీ అంటే.. శాసనాలు చేసే సభ. దాన్నే చట్టం, రాజ్యాంగంతో సంబంధంలేని సభగా మార్చేసిన పరిస్థితిని కూడా కళ్లెదుటే కనిపించింది. అనర్హత వేటు వేయడని ప్రభుత్వంపై.. ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో .. తాజా ఎన్నికలు నిరూపించాయి. ఈ సభను చూసి తెల్సుకోవచ్చు.” అన్నారు సీఎం.

“దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందో నిన్నటి ఎన్నికలే నిదర్శనం. 23 మంది ఎమ్మెల్యేలలను.. ముగ్గురు ఎంపీలను అప్పటి అధికార పార్టీ కొనుక్కుంటే.. అదే సంఖ్యలో ఆ పార్టీకి ఎమ్మెల్యేలను, ఎంపీలను ఇచ్చాడు. ఇంత గొప్పగా జరిగింది అంటే.. దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడు అనేది తెల్సిపోతుంది. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈ రెండూ ఇవాళ చట్టసభలోచూస్తున్నాం. విలువలు విశ్వసనీయత ఉన్న రాజకీయాలకు కేరాఫ్ గా ఏపీని మార్చుతాం. మొదటిరోజునుంచి అదే దిశగా కదులుతున్నాం. స్పీకర్ ఒక లీడర్ ఆఫ్ ద హౌజ్. స్పీకర్ ఎలా ఉండకూడదో.. గత శాసన సభలో చూశాం. ఎలా ఉండాలో ఈ శాసన సభలో నిరూపిస్తుంది.” అని చెప్పారు ముఖ్యమంత్రి జగన్.