ఇంటి నుంచి సీఎం జగన్ పాలన.. ఎందుకంటే?

ఇంటి నుంచి సీఎం జగన్ పాలన.. ఎందుకంటే?

సెక్రటేరియట్ కు వచ్చి ఇవాళ (శుక్రవారం) బాధ్యతలు స్వీకరించాలనుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు. తన ఇంటి నుంచే నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మంచి ముహూర్తంలో సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్‌తో సవాంగ్ భేటీ అయ్యారు. అలాగే పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో సమావేశం కాబోతున్నారు. ఆర్థిక పరిస్థితి, ఆయా శాఖల స్థితిగతులపై జగన్ సమీక్ష జరపనున్నారు.

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా జగన్‌తో భేటీ కాబోతున్నారు. అధికారుల బదిలీలు, రాష్ట్ర పరిస్థితిపై మరోసారి చర్చలు జరపనున్నారు. ఇప్పటికే సీఎంవోలోని ఉన్నతాధికారులను నిన్న(గురువారం) బదిలీ చేశారు. అంతేకాదు  నేడో, రేపో మరికొందరు అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.  అంతేకాదు కేబినెట్ ఏర్పాటు కూడా త్వరలో చేయనున్నారు. జూన్ 7, లేదా 8న కేబినెట్‌ను ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మరోవైపు కేబినెట్‌లో బెర్త్‌ల కోసం కొందరు నేతలు… జగన్ ఇంటికి క్యూ కడుతున్నారు. మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.