
- అద్వానీకి ప్రధాని పదవి ఇవ్వగలరా?
హైదరాబాద్, వెలుగు: దేశానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ చేసిన త్యాగాలపై చర్చకు సిద్ధమా అని బీజేపీకి కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియా, రాహుల్ కు ఉన్న గొప్ప గుణం బీజేపీ నేతల్లో ఎవరికైనా ఉంటే చర్చకు రావాలని చాలెంజ్ చేశారు. యావత్ దేశం సోనియాను ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ ను గెలిపిస్తే.. ఆమె మాత్రం ప్రధాని పదవి వద్దని మన్మోహన్ సింగ్ కు అప్పగించారని గుర్తు చేశారు.
‘‘కనీసం రాహుల్ గాంధీనైనా ప్రధానిని చేయాలని సోనియాను మన్మోహన్ సింగ్ కోరగా.. మీరే (మన్మోహన్) ఆ పదవిని చేపట్టండని చెప్పిన గొప్ప త్యాగశీలి సోనియా. త్యాగాల చరిత్ర లేని బీజేపీకి.. త్యాగాలకు మారుపేరైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీని నిలబెట్టిన ఎల్‌కే అద్వానీకి ప్రధాని పదవి ఇచ్చి త్యాగగుణాన్ని చాటుకోగలరా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు దొంగ ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చారని తమ నేత రాహుల్ ఆధారాలతో సహా నిరూపించారని, బీజేపీ నేతలు ఆ విషయం జీర్ణించుకోలేక సోనియా, రాహుల్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.