- మీ ఇంటి పంచాయితీలో నన్నెందుకు లాగుతున్నవ్?
- కల్వకుంట్ల కవితపై జగ్గారెడ్డి ఫైర్
- వైఎస్ పనితీరు నచ్చే కాంగ్రెస్‌లో చేరానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుతో ఉన్న గొడవల వల్లే తాను గతంలో బీఆర్ఎస్ ను వీడానని కవిత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్ రావుతో తనకు ఎప్పుడూ రాజకీయ వైరం మాత్రమే ఉంటుందని, ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. హరీశ్ తో గొడవల వల్లే తాను పార్టీ మారానని అనడం అబద్ధమని చెప్పారు. తనను అనవసరంగా లాగి ఇంటి పంచాయితీ పెట్టవద్దన్నారు. ‘‘కవిత ఇతరుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ రాజకీయాల గురించి ఆలోచించుకుంటే మంచిది.
నన్ను ఎందుకు నీ ఇంటి పంచాయితీలో లాగుతున్నవ్? కేసీఆర్ లేకపోతే కవితకు రాజకీయంగా అడ్రస్ ఉండేది కాదు. తండ్రి చాటు బిడ్డగానే ఆమెకు గుర్తింపు ఉంది. కవిత అభిమాన సంఘాల పేరుతో నాపై సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పెడుతున్నారు. ఇలాంటి చిల్లర ట్రిక్స్ మానుకో. ఇప్పటికైనా తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఆపేయాలి” అని జగ్గారెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి హరీశ్ రావు కారణం కాదని, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డే అందుకు ప్రధాన కారణమని జగ్గారెడ్డి వెల్లడించారు.
అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి సంగారెడ్డిలో రెండు మున్సిపాలిటీలను గెలిపించిన తన పనితీరును చూసి, మెచ్చుకొని వైఎస్ఆర్ తనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారని గుర్తుచేశారు. కంది ఐఐటీ కోసం భూములిచ్చిన రైతులకు వైఎస్ఆర్ ఎంతో మేలు చేశారని చెప్పారు. సంగారెడ్డి అభివృద్ధి కోసం పాటుపడుతుంటే.. గతంలో కొందరు తనను టార్గెట్ చేయడం వల్లే రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాల్సి వచ్చిందని వివరించారు.
