మేడిగడ్డ కుంగిందా? లేదా? : జగ్గారెడ్డి

మేడిగడ్డ కుంగిందా? లేదా? : జగ్గారెడ్డి
  •  కేటీఆర్, హరీశ్​ చెప్పాలి 

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినయా? లేదా? అనేది కేటీఆర్, హరీశ్​రావు చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డనా.. బొందల గడ్డనా.. అక్కడ ఏం పీకడానికి పోతున్నారని నల్గొండ సభలో కేసీఆర్​అన్నారని, ఇప్పుడు కేటీఆర్​ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ సర్కారు అవినీతిని జనానికి చూపించడానికే  సీఎం, మంత్రులు మేడిగడ్డకు వెళ్లారన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తొమ్మిదేండ్లు వేల కోట్లు కమీషన్ల రూపంలో తీసుకున్నారని ఆరోపించారు. 

తప్పు చేశారు కాబట్టే ఇరిగేషన్​పై చర్చ జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి  కేసీఆర్​రాలేదన్నారు. సీఎం రేవంత్ భాష గురించి మాట్లాడే బీఆర్​ఎస్​ నాయకులు.. కేసీఆర్ మాటలు గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ ఒక్కటంటే మేం వంద అంటామని జగ్గారెడ్డి హెచ్చరించారు. కడియం శ్రీహరి మాటలకు విలువ లేదని, బాల్క సుమన్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నాడన్నారు. పొన్నం ప్రభాకర్​పై బండి సంజయ్ కామెంట్స్​ సరికాదని, వెంటనే  క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. మెదక్ ఎంపీగా పోటీ చేయాలనుకోవడం లేదని, పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారు బరిలో ఉంటారన్నారు. టైమ్​ బాలేకనే సంగారెడ్డిలో ఓడినట్టు జగ్గారెడ్డి చెప్పారు.