- బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు: జగ్గా రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాహుల్ గాంధీని మూడో వరుసలో కూర్చోబెట్టడం కుట్ర పూరితంగా ఆయన్ను అవమానించడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ ఎక్కడ కూర్చున్నా సింహాసనంపై కూర్చునట్టుగానే ప్రజలు గౌరవిస్తారని తెలిపారు. మంగళవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ సింహం. ప్రియాంకా గాంధీ చిరుత పులి. అలాంటి వారిని ప్రధాని మోదీ రాజకీయంగా అడ్డుకోవాలని చూస్తే దేశ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
బీజేపీకి ప్రజలు అధికారమిచ్చింది ప్రజలకు మంచి పాలన అందించాలని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మాత్రమే. కానీ మోదీ మాత్రం ప్రధాని హోదాలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా దేశ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ ను ప్రధానిగా చేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. మోదీ సింహాసనం మీద కూర్చుంటేనే ప్రధానిగా ప్రజలు గుర్తిస్తారు. కానీ రాహుల్ ఎక్కడ కూర్చున్నా ప్రజలు గౌరవిస్తారు’’ అని జగ్గా రెడ్డి పేర్కొన్నారు.
