పీసీసీ రేసులో నేను కూడా ఉన్నా

పీసీసీ రేసులో నేను కూడా ఉన్నా

సంగారెడ్డి: పీసీసీ పదవి కోసం పైరవీలు చేసేందుకు ఇది సరైన సమయం కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి ఇంకా తగ్గనందున ఇలాంటి వాటి కోసం ఇది సరైన టైమ్ కాదన్నారు. ఢిల్లీలో కదలికలు వచ్చాయని హడావిడి చేస్తున్నారని, కానీ అలాంటిది ఏమిలేదన్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ పై ఫోకస్ పెట్టకుండా.. పదవుల కోసం ఆరాట పడొద్దన్నారు. 

'పీసీసీ పదవి గురించి కొన్ని మీడియా ఛానళ్లలో కావాలనే ప్రచారం చేసుకుంటున్నారు. సీనియర్ల అభిప్రాయం తీసుకొనే పీసీసీ పదవి ఇవ్వాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంది కాబట్టి ఈటల అటువైపు చూస్తున్నారు. పోలీస్ ల నుంచి తప్పించుకోడానికి ఈటల కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పుడున్న సమయంలో పీసీసీ పదవి అవసరం లేదు. నన్ను పీసీసీ చేస్తే అన్ని సమస్యలు తీరుతాయి.
ప్రజల కష్టాలు తీర్చే మెడిసిన్ నా వద్ద ఉంది. ఆనందయ్య లాంటి మందు అందుబాటులో ఉంది. సోనియా పీసీసీ పదవిని ఎవరికి ఇచ్చిన కలిసే పనిచేస్తాం. నాకు ఇష్టం ఉన్న వ్యక్తికి పీసీసీ వస్తే ఇష్టంగా రాష్ట్రమంతా పనిచేస్తా లేదంటే నా నియోజక వర్గానికే పరిమితం అవుతా' అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.