- జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల/కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా పూర్తయిందని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. గురువారం మేడిపల్లి, భీమారం, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట సాధారణ పరిశీలకుడు రమేశ్, అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, డీపీవో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు, ఆర్డీవోలు జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఉన్నారు.

