జగిత్యాలలో ట్యాక్స్ గోల్‌‌‌‌మాల్‌‌‌‌ .. ఏటా బల్దియాకు రూ.2కోట్ల దాకా నష్టం

జగిత్యాలలో ట్యాక్స్  గోల్‌‌‌‌మాల్‌‌‌‌ .. ఏటా బల్దియాకు రూ.2కోట్ల దాకా నష్టం
  •  కమర్షియల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌కు రీ అసెస్‌‌‌‌మెంట్ చేయక.. ఏటా బల్దియాకు రూ.2కోట్ల దాకా నష్టం 
  •  బల్దియాలో మొత్తం 28 వేల ప్రాపర్టీలు.. వీటిలో కమర్షియల్‌‌‌‌ 5 వేలకు పైగానే..
  •  కొలతల్లోనూ గోల్‌‌‌‌మాల్‌‌‌‌తో భారీగా నష్టపోతున్న బల్దియా 
  •  ఈ వ్యవహారంలో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న ఆఫీసర్లు

ఈ ఫోటోలో కనిపిస్తున్న బిల్డింగ్‌‌‌‌ జగిత్యాల బల్దియా వాణినగర్‌‌‌‌‌‌‌‌లోనిది. ఈ బిల్డింగ్‌‌‌‌లో బ్యాంకు నిర్వహిస్తున్నారు. ఆరేండ్ల కింద ఇది పూర్తికాగా.. గతంలో పాత బిల్డింగ్‌‌‌‌కు ఉన్న ట్యాక్స్‌‌‌‌ రూ.1,246 మాత్రమే వసూలవుతోంది. 2019 నుంచి విస్తీర్ణం బట్టి రూ.75 వేల వసూలు కావాల్సి ఉండగా ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

జగిత్యాల పాత బస్టాండ్‌‌‌‌లోని వివేకానంద స్టేడియం పక్కన 7–6-–109, 7–6–110, 7–6-–111 నంబర్లతో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ 2021లో పూర్తి చేశారు. అప్పటి నుంచి ట్యాక్స్ వసూల్‌‌‌‌ చేయాల్సి ఉండగా.. 2024 నుంచి రూ.3.90లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన మూడేండ్లకు సుమారు రూ.11.70లక్షలు బల్దియా నష్టపోయింది. 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల బల్దియాలో ప్రాపర్టీ ట్యాక్స్‌‌‌‌ వసూళ్లలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆఫీసర్లు కమర్షియల్ బిల్డింగ్‌‌‌‌లకు రీ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయకపోవడంతో ఏటా రూ.కోట్లలో బల్దియా నష్టపోతోంది. ఈ వ్యవహారంలో ఆఫీసర్లు రూ.లక్షల్లో వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.కోట్లలో ఆదాయానికి గండి

జగిత్యాల బల్దియాలో మొత్తం 28 వేల బిల్డింగ్స్ ఉన్నాయి. వీటిలో 23 వేల రెసిడెన్షియల్, 5 వేలకు పైగా కమర్షియల్, మిక్స్‌‌‌‌డ్ రెసిడెన్షియల్ -కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఏటా బల్దియాకు దాదాపు రూ.7 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్‌‌‌‌ ఉండగా.. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో రూ. 3.5 కోట్లు మాత్రమే వసూలు అవుతోంది. దీనిలో కమర్షియల్ బిల్డింగ్స్‌‌‌‌కు సంబంధించిన ట్యాక్స్‌‌‌‌ దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఈ కమర్షియల్ బిల్డింగ్స్‌‌‌‌కు రీ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయకపోవడం.. కొలతలు, బిల్డింగ్ పూర్తి చేసిన సమయాన్ని తగ్గించడంతో ఒక్కో బిల్డింగ్‌‌‌‌కు రూ.లక్షల్లో వసూలు కావాల్సి ఉండగా రూ.వేలల్లోనే వసూల్‌‌‌‌ అవుతోంది. ఈ వ్యవహారంలో బిల్డింగ్ ఓనర్ల నుంచి బల్దియా ఆఫీసర్లు రూ.లక్షల్లో ముడుపులు అందుతున్నట్లు అరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కమర్షియల్ బిల్డింగ్స్ ఆదాయం  రూ.1.5 కోట్లు ఉండగా, రూల్స్ ప్రకారం ట్యాక్స్ అమలు చేస్తే మరో రూ.1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఈ లెక్కన రూ. 7 కోట్ల ట్యాక్స్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ నుంచి రూ. 9 కోట్లకు పెరిగే చాన్స్ ఉంది. 

ట్యాక్స్ వసూళ్లలో అక్రమాలు 

ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో బల్దియాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల బల్దియాలోని ఓ  ఉద్యోగి రూ.60 వేల పక్కదారి పట్టించినట్లు జులై 25న బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై అధికారులు ఇంటర్నల్ ఎంక్వైరీ చేయగా.. ఆ అమౌంట్ దాదాపు రూ.3 లక్షల వరకు  ఉంటుందని తేలింది. 

అలాగే కమర్షియల్ ట్యాక్స్‌‌‌‌ను తగ్గించి అక్రమాలకు పాల్పడుతున్న వ్యవహారంపై 2025 మార్చి 11న కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అడిషన్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై అదే నెలలో జగిత్యాల బల్దియా ఆఫీసర్లకు మెమో కూడా వచ్చింది. ఇలాంటి వరస ఘటనల నేపథ్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.