కోరుట్ల, వెలుగు: కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట, అంబారిపేట, తాండ్రియాల, గంభీర్‌పూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ధాన్యం తూకం, నిల్వ , రవాణా ప్రక్రియల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో జివాకర్ రెడ్డి , డీసీవో మనోజ్ కుమార్, తహసీల్దార్ , అధికారులు పాల్గొన్నారు.
వడ్లు, మక్కల కొనుగోళ్లపై కలెక్టర్ రివ్యూ
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం వడ్లు, మొక్కజొన్నల కొనుగోళ్లపై అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తగినంత మంది హమాలీలు, లారీల ద్వారా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని గోదాములకు తరలించాలన్నారు. రివ్యూలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, సివిల్ సప్లై అధికారులు రాజేందర్, సుధాకర్, డీఎం మార్క్ ఫెడ్ మహేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, పాల్గొన్నారు.
వడ్ల దిగుమతిలో ఆలస్యం చేయొద్దు
కోల్‌బెల్ట్, వెలుగు: ధాన్యం దిగుమతి ప్రక్రియలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం మందమర్రి మండలం అందుగులపేటలో గల వాసవి రైస్ మిల్‌లో కలెక్టర్ ధాన్యం దిగుమతి ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొంటోందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని ఆదేశించారు. సివిల్ సప్లూ అధికారి బ్రహ్మారావు, మేనేజర్ శ్రీకళ, తహసీల్దార్ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
